Loading...
Andhra Pradesh: ఏపీకి కేంద్రం దీపావళి కానుక.. పన్నుల వాటాలో రూ.4,597 కోట్లు విడుదల!
ఏపీకి కేంద్రం దీపావళి కానుక.. పన్నుల వాటాలో రూ.4,597 కోట్లు విడుదల!

Andhra Pradesh: ఏపీకి కేంద్రం దీపావళి కానుక.. పన్నుల వాటాలో రూ.4,597 కోట్లు విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రాల పన్నుల వాటా కింద కేంద్ర ఆర్థిక శాఖ భారీగా నిధులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.1,09,019 కోట్లను విడుదల చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.19,208 కోట్లు దక్కాయి. ఆ తర్వాత బిహార్‌కు రూ.10,845 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.8,010 కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ.7,866 కోట్లు, మహారాష్ట్రకు రూ.7,022 కోట్లు, రాజస్థాన్‌కు రూ.6,460 కోట్లు విడుదలయ్యాయి.

వివరాలు

నిధులను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్రం విడుదల చేసిన మొత్తం నిధుల్లో ఈ ఆరు రాష్ట్రాలకే రూ.59,411 కోట్లు దక్కాయి. అంటే మొత్తం నిధుల్లో 54.49 శాతం వాటా ఈ రాష్ట్రాలకు కేటాయించారు.

సాధారణంగా ప్రతి నెలా రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల వాటాకు అదనంగా మరో విడత మొత్తాన్ని జతచేసి కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది.

రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు రాష్ట్రాల మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహాలో అదనపు విడత నిధులను కేంద్రం విడుదల చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.

వివరాలు

అర్నబ్‌ తుఫాన్‌ నష్టంపై కేంద్ర బృందం పరిశీలన

మరోవైపు అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కేంద్ర బృందానికి అందజేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,253 గ్రామాల్లో 3.33 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఈ నేపథ్యంలో తుఫాన్‌ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది.

తొలుత రావులపాలెం చేరుకున్న బృందం.. తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది.

ADVERTISEMENT

వివరాలు

తమను ఆదుకోవాలని విజ్ఞప్తి

ఈ సందర్భంగా పలువురు రైతులు కేంద్ర బృందం అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ కేంద్ర బృందానికి వివరించారు.

పంటల నష్టంతో పాటు మత్స్యకారులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.

ADVERTISEMENT

వివరాలు

కేంద్ర బృందంలో ఉన్నది వీరే..

ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌ దాస్‌, కేంద్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ ప్రశాంత్‌ ఆర్మోకర్‌, ఆర్థికశాఖ డైరెక్టర్‌ హిమాలయ గర్గే, కేంద్ర విద్యుత్తుశాఖ డైరెక్టర్‌ ప్రణయ్‌ గర్గే ఉన్నారు.

వీరితో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తదితరులు కూడా పర్యటనలో పాల్గొన్నారు.

కేంద్ర బృందం తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పంటలు, ఉద్యానవనాలు, మత్స్యకారుల బోట్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించి వివరాలు సేకరించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందజేయడంతో కేంద్ర బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT