Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య
గురుగ్రామ్‌లో తన భార్యను చంపిన కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను చంపిన సమయంలోనే వారి రెండేళ్ల కుమారుడిపై దాడి చేసి ఇంట్లోనే వదిలేసి తాళం వేసి పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి సంఘటన స్థలం నుండి పారిపోయి ఘజియాబాద్‌లోని కౌశాంబి మెట్రో స్టేషన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గౌరవ్ శర్మ (30) అనే వ్యక్తి పదునైన ఆయుధంతో తన భార్య గొంతు కోసి ఇటుకతో తలపై కొట్టాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి తన కొడుకును కూడా ఇటుకతో కొట్టాడని వారు తెలిపారు. అతని భార్య లక్ష్మీ రావత్ (24)గా గుర్తించారు.
గాయపడిన చిన్నారి ఆసుపత్రికి తరలింపు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం DLF ఫేజ్ 3లోని ఓ ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపిస్తుండటంతో స్థానికులు సెక్యూరిటీ గార్డుకు సమాచారం అందించారు. గార్డు అర్థరాత్రి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తలుపులు పగులగొట్టి చూడగా మహిళ మృతదేహం, గాయపడిన చిన్నారి ఏడుస్తూ కనిపించింది. గాయపడిన చిన్నారిని వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతడిని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగించి, ఆగ్రాలోని వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు.
భార్య,భర్తల మధ్య ఘర్షణ
ఆగ్రాకు చెందిన లక్ష్మి తన భర్త గౌరవ్‌తో కలిసి గురుగ్రామ్‌లో ఉంటోంది. ఈ జంట ఆరు నెలల క్రితం గురుగ్రామ్‌కు మకాం మార్చారు. గౌరవ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడని, కొన్న రోజులుగా ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మధ్య భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారని చుట్టూ పక్కవారు తెలిపారు. ఈ క్రమంలో వారిరువురి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దఎత్తున ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటుకతో కొట్టడంతో మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.