SKOCH Awards: ఏపీకి అరుదైన ఘనత.. రాష్ట్రానికి ఏడు స్కోచ్ అవార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఏడు స్కోచ్ అవార్డులు లభించాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సోషల్ ఆడిట్ విభాగం, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సమాచార, పౌరసంబంధాలశాఖ, రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘంతో పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో చేపట్టిన జీరో పావర్టీ-పీ-4, నెట్జీరో కార్యక్రమాలకు ఈ అవార్డులు దక్కాయి. దిల్లీలో శనివారం 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.
వివరాలు
అవార్డులు పొందిన అధికారులు వీరే
ఈ కార్యక్రమంలో స్కోచ్ సంస్థ ఛైర్మన్ సమీర్ కొచ్చార్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. రాష్ట్ర సోషల్ ఆడిట్ విభాగం డైరెక్టర్ జి. శ్రీకాంత్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ పీవీ సత్యనారాయణ
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ సూర్యచంద్రరావు, రీజినల్ ఇన్‌ఫర్మేషన్ ఇంజినీర్ (ఆర్‌ఐఈ) నాగరాజు
రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాణి సుష్మిత, అమలాపురం పురపాలక సంఘం కమిషనర్ నిర్మల్‌కుమార్, కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ అవార్డులు స్వీకరించారు.
వివరాలు
సోషల్ ఆడిట్ విభాగం చేపడుతున్న కార్యక్రమాలకు అవార్డు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రస్తుతం వీబీ జీరామ్‌జీ అమలులో భాగంగా సోషల్ ఆడిట్ విభాగం చేపడుతున్న కార్యక్రమాలకు అవార్డు లభించింది.
సోషల్ ఆడిట్ ఫలితాలను ప్రజల ముందుంచడంతో పాటు వాటిని డిజిటలైజ్ చేస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కింది.
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు 50 వేల మందికిపైగా విద్యార్థులను తీర్చిదిద్దినందుకు స్కోచ్ అవార్డును అందుకుంది.
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినందుకు కూడా అవార్డు దక్కింది.
వివరాలు
జాతీయ స్థాయిలో గుర్తింపు
అదే శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్.. అమరావతి 'క్వాంటం వ్యాలీ' డిజిటల్, సోషల్ మీడియా మార్కెటింగ్ అంశంలో స్కోచ్ గోల్డ్ అవార్డును సాధించింది.
ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘం సమగ్ర వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు స్కోచ్ అవార్డుతో గుర్తింపు పొందింది.
అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పంలో చేపట్టిన జీరో పావర్టీ-పీ-4, నెట్జీరో కార్యక్రమాలకు కూడా స్కోచ్ అవార్డులు లభించాయి.
మొత్తంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యక్రమాలకు ఏడు స్కోచ్ అవార్డులు రావడం ద్వారా వాటి పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.