పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం
జమ్ముకశ్మీర్‌లోని ఒక విద్యార్థి తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది. సీరత్ నాజ్ అనే మూడో తరగతి చిన్నారి తన పాఠశాల దుస్థితిని మోదీకి వివరిస్తూ విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.91లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే, జమ్ము స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ రిమోట్ లోహై-మల్హర్ బ్లాక్‌లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శంచారు.
1,000 కొత్త కిండర్ గార్టెన్‌ల నిర్మాణం
పాఠశాలను ఆధునిక పద్ధతిలో అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.91 లక్షలు మంజూరైనట్లు రవిశంకర్ శర్మ పేర్కొన్నారు. అయితే పరిపాలనాపరమైన అనుమతులకు సంబంధించి కొన్ని సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కారమయ్యాయని, పనులు జరుగుతున్నాయని శర్మ తెలిపారు. జమ్ములో దాదాపు 1,000 కొత్త కిండర్ గార్టెన్‌ల నిర్మాణం జరుగుతోందని రవిశంకర్ శర్మ వెల్లడించారు. రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో జమ్ము ప్రావిన్స్‌లో 250 కిండర్ గార్టెన్‌లను నిర్మిస్తామన్నారు. తన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడంపై స్పందించిన సీరత్ నాజ్ ఆనందం వ్యక్తం చేసింది.