Train Accident : మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ రైలు ప్రమాదం జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు చోటుచేసుకుంది. ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22191) "డెడ్ స్టాప్ స్పీడ్" వద్ద ప్రమాదానికి గురైంది. పశ్చిమ మధ్య రైల్వే రైలు ఇండోర్ నుంచి జబల్‌పూర్ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 6కి చేరుకుంటున్న సమయంలో ముందు ఉన్న రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని సీపీఆర్‌వో హర్షిత్ శ్రీవాస్తవ చెప్పారు.
ఇటీవల తరుచూ రైలు ప్రమాదాలు
ఇటీవల కాలంలో ఈ తరహా ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నెల రోజుల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జులై 30న జార్ఖండ్‌లో హౌరా-ముంబై సీఎస్‌ఎమ్‌టీ మెయిల్ కూడా ప్రమాదానికి గురై, 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 20 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.