
సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
జస్టిస్ వి.సుజాత హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఈ ఘటన జరిగింది.
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న పొదల్లో దూసుకెళ్లిందని పోలీసులు వెల్లడించారు.
బాటసారులు ప్రమాదం విషయాన్ని పోలీసులకు చెప్పడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యాయమూర్తిని వెంటనే సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఏపీ
మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ.. కాన్వాయ్‌లో హైదరాబాద్ తరలింపు
ప్రమాదంలో న్యాయమూర్తి సుజాతకు గాయాలు కాగా ఆమె తలపై రెండు కుట్లు పడ్డాయి. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి వెంటనే ఆస్పత్రికి వెళ్లి జస్టిస్ సుజాతను పరామర్శిచారు.
ఆమెకు మెరుగైన చికిత్స నిమిత్తం స్వయంగా తన కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు తరలించారు.
తన కాన్వాయ్ మధ్యలో అంబులెన్స్ ఉంచి, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మార్గ మధ్యంలో ఎలాంటి అడ్డంకులు కలగకుండా, స్యూర్యాపేట- హైదరాబాద్ హైవే పోడగునా పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు.