'కథాకళి' పేరుతో ఒక గ్రామం; శాస్త్రీయ నృత్య రూపానికి అరుదైన గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ రాష్ట్ర కళా వారసత్వంగా భావించే శాస్త్రీయ నృత్య రూపం 'కథాకళి'కి అరుదైన గౌరవం లభించింది. ఒక గ్రామానికి 'కథాకళి' పేరును అంకితం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు చేసింది. దీంతో దశాబ్దాల కల నెరవేరడంతో ఆ గ్రామ ప్రజలు ఆనందంలో ముగిపోతున్నారు.
2010లో ఐరూర్ పంచాయతీ పేరును 'కథాకళి గ్రామం 'గా మార్చాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేయగా 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈనెల 21న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సర్వే జనరల్ కార్యాలయం నుంచి పంచాయతీ పేరును కథాకళిగా మారూస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దీంతో గ్రామస్థులు సగర్వంగా తమ 'కథాకళి గ్రామం' అని ఉన్న బోర్టును సరిహద్దులో ఏర్పాటు చేసుకున్నారు.
కథాకళి
'కథాకళి'కి ఈ గ్రామాన్నే ఎందుకు అంకితం ఇచ్చారు?
ఇప్పుడు 'కథాకళి'గా పేరు మారిన ఐరూర్ పంచాయతీ ప్రజల జీవితం శాస్త్రీయ నృత్య రూపం చుట్టూ తిరుగుతుంది. వారి జీవన విధానంలో 'కథాకళి' ఒక భాగం. ఈ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా 'కథాకళి' నృత్యకారులే కనిపిస్తారు. రంగురంగుల తలపాగా, దుస్తులు ధరించి నృత్యంతో ముద్రలు వేస్తూ దర్శనమిస్తుంటారు.
ముఖ్యంగా అంతరించిపోతున్న 'కథాకళి' బతికించడం కోసం 1995 నుంచి ఈ గ్రామస్థులు విశేష కృషి చేస్తున్నారు.
1995లో 'పతనంతిట్ట కథాకళి క్లబ్'ను ప్రారంభించి కళారూపంలోని గొప్ప సంప్రదాయమైన 'కథాకళి'ని కాపాడుకోవడానికి నడుంబిగించారు. శాస్త్రీయ నృత్య రూపాన్ని బతికించేందుకు అష్టకష్టాలు పడ్డారు.
కథాకళి
17 సంవత్సరాలుగా కథాకళి పండుగ నిర్వహణ
గ్రామంలో 'పతనంతిట్ట కథాకళి క్లబ్' ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా కథాకళి పండుగను నిర్వహిస్తున్నారు. వారం రోజులు పాటు జరిగే ఈ వేడుకలో దాదాపు 10వేల మందికి పైగా పిల్లలు, గురువులు, కళాభిమానులు పాల్గొంటారు.
రాష్ట్రంలో పలు పాఠశాలల్లో కళారూపాల అకడమిక్ శిక్షణ కూడా ఈ గ్రామస్థులు ఇస్తున్నారు. అంతేకాదు క్లబ్ ఆధ్వర్యంలో 'కథాకళి' మ్యూజియం ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నట్లు క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి వీఆర్ విమల్‌రాజ్ పేర్కొన్నారు.
తమ గ్రామంలో గురుకుల విధానాన్ని అనుసరించే చాలా మంది కథాకళి ఆచార్యులు ఉన్నారని విమల్‌రాజ్ అన్నారు. కానీ కాలక్రమేణా పురాతన కళారూపం అంతరించిపోతుందని, ఆ వైభవాన్ని నిలుపుకునేందుకు కళాభిమానులందరూ కలిసి 1995లో క్లబ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.