Page Loader
Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత 
Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత

Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత 

వ్రాసిన వారు Stalin
Jan 23, 2024
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో యాత్ర మొదలైనప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ యాత్రను మంగళవారం గువాహటిలోని ప్రధాన రహదారుల గుండా నగరంలోకి అనుమతించలేదు. రాహుల్ గాంధీ యాత్రను ముందుకు వెళ్లకుండా రహదారిని దిగ్బంధించడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అది కాస్త.. ఘర్షణ వరకు వెళ్లింది. ట్రాఫిక్ అంతరాయం, శాంతిభద్రతల సమస్యల కారణంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్గాన్ని మార్చాలని అధికారులు కోరారు. యాత్రను గువాహటి నగరం బైపాస్‌ గుండా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో మంగళవారం ఘర్షణ చెలరేగింది.

రాహుల్

రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు నమోదు చేయండి: సీఎం హిమంత ఆదేశం

కాంగ్రెస్ నేతలు గువాహటి నగరానికి వచ్చి ప్రజలనుద్దేశించి ప్రసంగించాలని పట్టుబట్టారు. అయితే నగరంలోకి రాకుండా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ జెండాలు చేతబట్టుకున్న కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బారికేడ్‌ను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ దూరం నుంచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో మూక దాడికి ప్రేరేపించిన రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు.