West Bengal: అభిషేక్‌పై దాడి ఎఫెక్ట్.. మమత సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా !
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని తన కాళీఘాట్ నివాసంలో ఏర్పాటు చేసిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశం తక్కువ హాజరు కారణంగా రద్దైంది. తాజాగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 20 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఈ విషయంపై స్పందించిన టీఎంసీ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్,పార్టీ నేతలపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేకపోయారని తెలిపారు. శనివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగగా, ఆదివారం టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
వివరాలు
బ్లాక్, వార్డు స్థాయిలో నిరసన ర్యాలీలు
మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఈ సమావేశాన్ని హాజరు తక్కువగా ఉండటంతో చివరి నిమిషంలో రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని టీఎంసీ స్పష్టం చేసింది. పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న పోలీసు చర్యలు, స్థానిక నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సి రావడంతో సమావేశానికి హాజరు కాలేకపోయారని తెలిపింది. సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలతో మమతా బెనర్జీ అనధికారికంగా చర్చలు జరిపినట్లు కుణాల్ ఘోష్ వెల్లడించారు. సోమవారం బ్లాక్, వార్డు స్థాయిలో నిరసన ర్యాలీలు, మంగళవారం కోల్‌కతా నగర కేంద్రంలోని రాణి రష్మోని రోడ్డులో రోజంతా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు మమతా బెనర్జీ స్వయంగా నాయకత్వం వహించనున్నారు.
వివరాలు
జూన్ 2న ధర్నా కార్యక్రమం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొనసాగుతున్న హింస, అలాగే బుల్డోజర్లతో హాకర్ల తొలగింపు చర్యలకు వ్యతిరేకంగానే ఈ ఆందోళనలు చేపడుతున్నామని టీఎంసీ పేర్కొంది. జూన్ 2న జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీ తదుపరి రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు కుణాల్ ఘోష్ తెలిపారు. ఇదిలా ఉండగా, హూగ్లీ జిల్లా చండితాలాలో కల్యాణ్ బెనర్జీ తలకు గాయపడటం, అంతకుముందు రోజు అభిషేక్ బెనర్జీపై గుంపు దాడి జరగడం టీఎంసీకి వరుస ఎదురుదెబ్బలుగా మారాయి.