100 Most Polluted Cities: ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు.. టాప్ 100లో 93 భారత్‌లోనే! నివేదికలో సంచలన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి వేడుకలు ముగిసిన మరుసటి రోజే దేశవ్యాప్తంగా వాయు కాలుష్యంపై ఆందోళన మొదలైంది. నవంబర్ 8న జరిగిన దీపావళి సంబరాల తర్వాత పలు నగరాల్లో గాలి నాణ్యత సూచీ(AQI) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నవంబర్ 9 ఉదయం 10:05 గంటలకు AQI.in విడుదల చేసిన అంతర్జాతీయ కాలుష్య నగరాల నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలుగా గుర్తించిన టాప్ 100 జాబితాలో ఏకంగా 93 నగరాలు భారత్‌లోనే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సాధారణంగా చలికాలంలో దిల్లీ,ఉత్తర భారతదేశంలోని కొన్ని నగరాల్లోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అయితే ఇప్పుడు విషపూరితమైన పొగమంచు దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. పలు నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోతోంది.
వివరాలు
టాప్ 10లో ఎక్కువగా భారత నగరాలే..
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానంలో నిలిచింది.
అక్కడ ఏకంగా 868 ఏక్యూఐ నమోదైంది. ఈ స్థాయిని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీగా వర్గీకరించారు.
పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ 842 ఏక్యూఐతో రెండో స్థానంలో ఉండగా.. భటిండా 797 ఏక్యూఐతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
వివరాలు
దిల్లీ ఏక్యూఐ రీడింగ్‌పై పలు అనుమానాలు
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మొదటి పది స్థానాల్లోనూ భారత నగరాలే అధికంగా ఉన్నాయి.
హరియాణాలోని సిర్సా 612 ఏక్యూఐతో నాలుగో స్థానంలో, భివానీ 548 ఏక్యూఐతో ఐదో స్థానంలో నిలిచాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బుదౌన్ 489, హిసార్ 485,పంజాబ్‌లోని అమృత్‌సర్ 451 ఏక్యూఐతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోని లాహోర్ 446ఏక్యూఐతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ 440 ఏక్యూఐతో పదో స్థానాన్ని దక్కించుకుంది.దేశ రాజధాని దిల్లీలో 380 ఏక్యూఐ నమోదైంది.
దీంతో అంతర్జాతీయంగా 15వ స్థానంలో నిలిచింది. అయితే దిల్లీ ఏక్యూఐ రీడింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇతర నగరాల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. లక్నోలో 344ఏక్యూఐ నమోదవడంతో 20వ స్థానం దక్కింది.
వివరాలు
దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకూ విస్తరించిన కాలుష్యం..
కాన్పూర్ 337 ఏక్యూఐతో 22వ స్థానంలో నిలిచింది. ఘాజియాబాద్‌లో 331, గ్రేటర్ నోయిడాలో 327, నోయిడాలో 307 ఏక్యూఐ నమోదయ్యాయి.
ఈ నగరాలన్నీ ప్రమాదకర కాలుష్య కేటగిరీలో కొనసాగుతున్నాయి.
వాయు కాలుష్యం కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితం కాలేదని నివేదిక వెల్లడించింది.
పశ్చిమ, మధ్య, తూర్పు భారతదేశంలోని నగరాల్లోనూ గాలి నాణ్యత తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
పుణెలో 278, భోపాల్‌లో 284, పట్నాలో 258 ఏక్యూఐ నమోదైంది. వారణాసిలో 243, రాజ్‌కోట్‌లో 242, నాసిక్‌లో 219 ఏక్యూఐ రికార్డయ్యాయి.
ఒడిశాలోని భువనేశ్వర్‌లో 200, పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో 197, హౌరాలో 187, కోల్‌కతాలో 183 ఏక్యూఐ నమోదైంది.
దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
భారత్ బయట ఏడు నగరాలు..
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల టాప్ 100 జాబితాలో భారత్ వెలుపల ఉన్న నగరాలు చాలా తక్కువగా ఉన్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన లాహోర్, పెషావర్, ఇస్లామాబాద్‌తో పాటు బ్రిటన్‌లోని కిడ్‌బ్రూక్, క్యాట్‌ఫోర్డ్, పోలాండ్‌లోని మియెలెక్, ఇండోనేషియాలోని సంపిట్ నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
మొత్తంగా భారత్ వెలుపల ఏడు నగరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
ఈ గణాంకాలను బట్టి దీపావళి వేడుకల వల్లే దేశంలో కాలుష్యం పెరిగిందని కచ్చితంగా చెప్పలేం.
అయితే పండుగ తర్వాత నమోదైన ఏక్యూఐ వివరాలు దేశంలో వాయు కాలుష్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి.
కాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత మెరుగుదలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.