LOADING...
Indian Mangoes: జపాన్ బాటలో నేపాల్.. భారత మామిడిపండ్ల దిగుమతులకు బ్రేక్
జపాన్ బాటలో నేపాల్.. భారత మామిడిపండ్ల దిగుమతులకు బ్రేక్

Indian Mangoes: జపాన్ బాటలో నేపాల్.. భారత మామిడిపండ్ల దిగుమతులకు బ్రేక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మామిడిపండ్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జపాన్ భారత మామిడి దిగుమతులను నిలిపివేయగా, తాజాగా నేపాల్ కూడా భారత మామిడిపండ్లపై నిషేధం విధించింది. పండ్లలో అధిక స్థాయిలో రసాయన పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సరైన క్వారంటైన్ సదుపాయాలు లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. నేపాల్ ఎందుకు నిషేధించింది? నేపాల్ వ్యవసాయ,పశుసంవర్థక మంత్రిత్వ శాఖ ఏప్రిల్-మే నెలల నుంచే భారత మామిడి దిగుమతులపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మధేశ్ ప్రావిన్స్ సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు తగిన స్థాయిలో లేకపోవడంతో పాటు,భారత నుంచి వచ్చే మామిడిపండ్లలో అధిక స్థాయిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీంతో దిగుమతులను నిలిపివేశారు.

వివరాలు 

నేపాల్‌కు లాభమా.. నష్టమా?

నేపాల్‌లో కూడా మామిడి సాగు జరుగుతున్నప్పటికీ, అక్కడి ఉత్పత్తి దేశ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతోంది. మే మధ్య నుంచి జూలై మధ్య వరకు మాత్రమే మామిడి సీజన్ ఉంటుంది. సిరాహా, సప్తరి, ధనుషా జిల్లాలు ప్రధాన మామిడి ఉత్పత్తి ప్రాంతాలు. భారత మామిడిపై నిషేధం వల్ల స్థానిక రైతులకు మంచి అవకాశాలు లభిస్తాయని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా పండించే ఆరోగ్యకరమైన పండ్లకు మార్కెట్ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే దేశీయ ఉత్పత్తి మాత్రమే ప్రజల అవసరాలను తీర్చేందుకు సరిపోదని నేపాల్ అధికారులే అంగీకరిస్తున్నారు.

వివరాలు 

ధరలు పెరిగే అవకాశం

నేపాల్ వ్యాపారులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత మామిడి దిగుమతులు నిలిచిపోతే మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జనక్‌పూర్‌ధామ్ పండ్లు,కూరగాయల వ్యాపారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ,నిషేధం విధించే బదులు నాణ్యత పరీక్షలు నిర్వహించి భారత మామిడిని అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఖాట్మండులో మామిడి ధర కిలోకు నేపాలీ 100 నుంచి 150 రూపాయల మధ్య ఉంది. నిషేధం కొనసాగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో భారత అరటిపండ్ల దిగుమతులపై ఆంక్షలు విధించిన తర్వాత వాటి ధరలు దాదాపు రెట్టింపు అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Advertisement

వివరాలు 

భారత్‌పై ఎంత ప్రభావం?

మామిడి పండ్లపై ఆధారపడిన జ్యూస్ పరిశ్రమలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారు. ప్రతి ఏడాది సుమారు 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. అయితే ఇందులో కేవలం 32 వేల మెట్రిక్ టన్నులే విదేశాలకు ఎగుమతి అవుతుండగా, మిగిలినవి దేశీయంగానే వినియోగమవుతున్నాయి. అమెరికా, యూఏఈ, యూకే, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా భారత మామిడికి ప్రధాన ఎగుమతి మార్కెట్లు. నేపాల్ పెద్ద మార్కెట్ కాకపోయినా, ఆల్ఫోన్సో, దసేరి, చౌసా, కేసర్, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రీమియం రకాల ఎగుమతులపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

జపాన్ కూడా ఇదే కారణంతో నిషేధం

అంతేకాదు, భారత పండ్ల ఉత్పత్తిలో రసాయన పురుగుమందుల వినియోగంపై అంతర్జాతీయంగా సందేహాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే జపాన్ కూడా దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత కేసర్, ఆల్ఫోన్సో, లంగ్రా, బంగినపల్లి వంటి మామిడి రకాల దిగుమతులను నిలిపివేసింది. భారత ప్రాసెసింగ్ కేంద్రాల్లో లోపాలు గుర్తించిన జపాన్ తనిఖీ బృందం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని చికిత్స కేంద్రాలను పరిశీలించిన అధికారులు ఫ్యూమిగేషన్, క్రిమిసంహారక చర్యల్లో లోపాలు గుర్తించారు. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత మామిడి ఎగుమతిదారులకు జపాన్, నేపాల్ నిర్ణయాలు మరో ఎదురుదెబ్బగా మారాయి.

Advertisement