'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇద్దరూ దొంగలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలిగిన నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు. ఒకరు దోపిడీదారు, మరొకరు దొంగ అని రెండు పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు కలిసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. బీజేపీతో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకున్నప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ, ఏఐఏడీఎంకే మరోసారి ప్రజలను మోసం చేస్తున్నాయి: ఉదయనిధి
బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నాయని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ రెండు పార్టీలు విడిపోవడం కొత్తకాదన్నారు. వీరు ఇప్పుడు విడిపోయినట్లు నటించినా, ఎన్నికల సమయంలో వారు మళ్లీ కలుస్తారని చెప్పారు. బీజేపీతో పొత్తు ముగిసినట్లు ఏఐఏడీఎంకే నేత కేపీ మునుసామి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీతో ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకున్నా, లేకున్నా డీఎంకే గెలవడం ఖాయంమన్నారు. ద్రావిడ ఐకాన్ సీఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాము ఎన్డీఏ నుంచి వైదొలగాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో ఏఐఏడీఎంకే మిత్రపక్షంగా ఉంది.