Andhra Pradesh: రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) చీఫ్ ఇంజినీర్ పంకజ్ అగర్వాల్ వెల్లడించారు. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం చేరే విధంగా పనిచేసే వాహనం-వాహనం కమ్యూనికేషన్ వ్యవస్థ (వీ2వీ)ని అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా, వరుసగా ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు ముందస్తు హెచ్చరికలు అందుతాయని ఆయన వివరించారు.
వివరాలు
పూర్తి సమాచారం లభిస్తే సమస్యలకు పరిష్కార మార్గాలు
దిల్లీలో సోమవారం నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా 'రోడ్డు రవాణా - ప్రమాదాల నివారణలో ఏఐ పాత్ర' అనే అంశంపై జరిగిన చర్చలో పంకజ్ అగర్వాల్ మాట్లాడారు. ఏఐ సహాయంతో రోడ్డు ప్రమాదాలు, వాటివల్ల జరిగే మరణాలను తగ్గించడం సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసులు సేకరిస్తున్న సమాచారం పూర్తిస్థాయిలో లేదని, అయితే ఏఐ వినియోగం ద్వారా సమగ్రంగా, ఖచ్చితమైన డేటా సేకరణ సాధ్యమవుతుందని తెలిపారు. అలాంటి పూర్తి సమాచారం లభిస్తే సమస్యలకు పరిష్కార మార్గాలు సులభంగా కనుగొనవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ చర్చను ఐఐటీ చెన్నైకి చెందిన అతుల్ సింగ్ సమన్వయం చేశారు.
వివరాలు
16 ఏళ్ల వయసు తర్వాత పాఠ్యాంశంగా డ్రైవింగ్ శిక్షణ: పంకజ్ అగర్వాల్
అతి వేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్న పంకజ్ అగర్వాల్, వేగ నియంత్రణలో ఏఐ కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రతిపాదిత వీ2వీ వ్యవస్థ ద్వారా ముందున్న వాహనానికి ప్రమాదం జరిగితే, ఆ సమాచారం వెంటనే వెనుక నుంచి వచ్చే వాహనాలకు చేరుతుందని, దాంతో డ్రైవర్లు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించగలుగుతారని వివరించారు. ప్రస్తుతం యువతకు సరైన డ్రైవింగ్ శిక్షణ అందడం లేదని పేర్కొన్న ఆయన, 16 ఏళ్లు దాటిన యువతీ, యువకులకు డ్రైవింగ్ శిక్షణను పాఠ్యాంశంగా తప్పనిసరిగా ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే నగరాల్లో కాలుష్యం కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, కాలుష్య నియంత్రణకు సంబంధించి తగిన విధానాలు రూపొందిస్తామని చెప్పారు.
వివరాలు
సడక్ సురక్ష మిత్ర ద్వారా యువతకు అవగాహన
దేశంలో ద్విచక్రవాహన ప్రమాదాల్లో తలకు గాయాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. మోర్త్ రోడ్డు ప్రమాదాల నివారణ విభాగం డైరెక్టర్ ఆర్.పి. శుక్లా మాట్లాడుతూ, సడక్ సురక్ష మిత్ర కార్యక్రమం ద్వారా యువతీ యువకులకు రోడ్డు భద్రతపై శిక్షణ ఇస్తామని తెలిపారు. వాలంటీర్లుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్న 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని తొలుత అమలు చేసి, అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు.
వివరాలు
జరిమానాలు ప్రజల భద్రత కోసమే..
రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలు ఖజానా కోసం కాదని, ప్రజల భద్రత కోసమేనని ఆయన స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించడం చలానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసం అని చెప్పారు. జుట్టుపై ప్రేమతో హెల్మెట్ ధరించడాన్ని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని, ముఖ్యంగా జెన్‌జీ తరం ముందుగా తమ శరీరాన్ని ప్రేమించి, దాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఇదివరకే ఐఐటీ చెన్నై సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ - రోడ్డు సేఫ్టీ విభాగాధిపతి ప్రొఫెసర్ వెంకటేష్ బాలసుబ్రహ్మణ్యం ప్రజెంటేషన్ ఇచ్చారు.
వివరాలు
ఇంటిగ్రేటెడ్ రోడ్డు సేఫ్టీ డ్యాష్‌బోర్డు ద్వారా వివిధ డేటా మార్గాల అనుసంధానం
రోడ్డు భద్రతలో ఏఐ ద్వారా తీసుకురానున్న మార్పులను ఆయన వివరించారు. ఏఐ ఆధారిత టూల్స్ సహాయంతో డేటాను సమన్వయం చేసి, ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా రూపొందించవచ్చని తెలిపారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించవచ్చన్నారు. చెన్నై ఐఐటీ అభివృద్ధి చేసిన సంజయ్,రాత్,థిన్‌ఏఐ, ఆర్‌ఎస్‌ఐఎల్‌టీ వంటి టూల్స్ పనితీరును వివరించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రోడ్డు సేఫ్టీ డ్యాష్‌బోర్డు ద్వారా వివిధ డేటా మార్గాలను అనుసంధానం చేసి, రోడ్డు భద్రతకు సంబంధించిన విధానాలను ఎలా మెరుగుపరచవచ్చో స్పష్టంగా వివరించారు.