AI Impact Summit 2026: AIతో ఉద్యోగాలకు ముప్పు లేదు.. ఉత్పాదకతే పెరుగుతుంది: పారిశ్రామికవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో ప్రారంభమైన AI ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ (AI) ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందన్న వార్తలలో నిజం లేదని, ఉద్యోగాలు పోవు గానీ పనితీరు మరింత మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. రాబోయే మూడు సంవత్సరాల్లో AI రంగం విపరీతంగా విస్తరిస్తుందని, ఈ టెక్నాలజీని అలవాటు చేసుకోని యువత వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. "ఆర్థిక వృద్ధి, సామాజిక మేలు కోసం AI" అనే సదస్సులో మాట్లాడిన మైక్రోసాఫ్ట్ ఇండియా-సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్, ప్రస్తుతం AI మోడళ్లు అసాధారణ వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.
వివరాలు
AI ప్రస్తుతం ఉద్యోగాలు తీసేయడానికి కాదు..
AI ఉద్యోగాలను చంపదు, ఉద్యోగాల రూపాన్ని మాత్రమే మార్చుతుందని, AI నేర్చుకోకపోతే భవిష్యత్తులో నిలదొక్కుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. భారత్‌లో AI ప్రతిభకు కొదవలేదని, ఇప్పటికే దేశంలోని 59 శాతం వ్యాపారాలు AI ఏజెంట్లను వినియోగిస్తున్నాయని వెల్లడించారు. ఇదే సమయంలో, ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీ మాట్లాడుతూ, AI వాడకంతో ఉద్యోగులను తొలగించడం కాదని, ఇప్పటివరకు సేవలు అందని మార్కెట్లకూ చేరువవ్వడం సాధ్యమవుతోందన్నారు. చాట్‌బాట్లు, వాయిస్‌బాట్ల సహాయంతో ఇప్పటివరకు చేరని తక్కువ ఆదాయ వినియోగదారులకూ సేవలు అందుతున్నాయని, AI ప్రస్తుతం ఉద్యోగాలు తీసేయడానికి కాదు... పనితీరును, ఉత్పాదకతను మరింత పెంచడానికే ఉపయోగపడుతోందని స్పష్టం చేశారు.