ఏఐఏడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా: శశికళ
ఏఐఏడీఎంకేలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో దివంగత జయలలిత సన్నిహితురాలు, పార్టీ మాజీ నేత వీకే శశికళ స్పందించారు. అన్నాడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదని, పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తానని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్టు తెలిపారు. పార్టీకి కార్యకర్తల బలం ముఖ్యమని, కేవలం 100 200 మంది వ్యక్తులతో నడపలేమని స్పష్టం చేశారు. అతి త్వరలోనే అందరం కలిసికట్టుగా పనిచేసి తమ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. తాము (జయలలిత మరియు ఆమె) మాట్లాడుకున్నప్పుడల్లా, చేసిన పనులు, చేయవలసిన పనుల గురించి చర్చించుకునేవాళ్లమని చెప్పారు. ఆమె వదిలేసిన పనులు పూర్తి చేయాలనేది తన కోరిక అని చెప్పారు.
పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా: శశికల
అన్నాడీఎంకేలో అంతర్గతంగా ఎన్ని గొడవలు జరిగినా పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని శశికల పేర్కొన్నారు. త్వరలోనే శశికలను కలుస్తానని ఇటీవల పన్నీర్ సెల్వం ప్రకటించారు. దీనిపై కూడా శశికల స్పందించారు. తన నుంచి వారు విడిపోయారని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. జయలలిత నిజాయతీగా, యథార్థంగా పనులు చేసేదని, కానీ డీఎంకే అలా కాదన్నారు. అన్నాడీఎంకే ద్వారా ప్రజలను రక్షించాలని, వారికి మంచి మార్గం చూపాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల నాటికి అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు ఒక్కతాటిపైకి వస్తాయని శశికల వివరించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజల అవసరాలను తీరుస్తామని చెప్పారు.