ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.
గతేడాది తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసుల విచారణలో భాగంగా ఈదాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
గత ఏడాది అక్టోబర్ 23న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కొట్టై ఈశ్వరన్ ఆలయం ముందు పేలుడు పదార్థాలు నింపిన కారు పేలింది. ఈ ఘటనలో ఐసీస్ సంబంధాలున్న జమేషా ముబీన్ మరణించాడు. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పదకొండు మందిని యాంటీ టెర్రర్ ఏజెన్సీ అరెస్టు చేసింది.
ఎన్ఐఏ
ఐసీసీ టెర్రర్ మాడ్యూల్‌ను స్థాపించేందుకు కుట్ర
గతేడాది నవంబర్‌లో మంగళూరులో ఆటోరిక్షాలో ప్రెషర్ కుక్కర్ పేలుడు ఘటనపై దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. అందులో మహ్మద్ షరీక్ అనే వ్యక్తి ఈఈడీతో తయారు చేసిన కుక్కర్ బాంబును తీసుకెళ్తున్న క్రమంలో ఇది జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు, పేలుడు పదార్థాన్ని తీసుకెళ్తున్న షరీఖ్, ఆటో డ్రైవర్ పురుషోత్తం గాయపడ్డారు.
రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా పెద్ద ఎత్తున దాడి చేసేందుకు కుక్కర్ బాంబులను ఐసీసీ రూపొందించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ కుట్రకు షరీఖ్ నాయకత్వం వహిస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది.
ఐసీసీ టెర్రర్ మాడ్యూల్‌ను స్థాపించాలనే ఉద్దేశ్యంతో షరీఖ్ నవంబర్‌లో దక్షిణాది అటవీ ప్రాంతాలను సందర్శించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ఈ దాడులు చేస్తోంది.