'ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ బతికే ఉన్నారు'; నెడుమారన్ సంచలన కామెంట్స్
తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ నాయకుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా ఉన్నారని ప్రకటించారు. త్వరలోనే తమిళ జాతి విముక్తి కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని పేర్కొన్నారు. తంజావూరులో జరిగిన విలేకరుల సమావేశంలో నెడుమారన్ మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచ పరిస్థితులు, రాజపక్సే ప్రభుత్వ తొలగింపుతో సహా శ్రీలంక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన బయటికి రావడానికి ఇదే అనుకూల సమయం అన్నట్లు నెడుమారన్ చెప్పారు. మే 18, 2009న శ్రీలకంలోని ఉత్తర ముల్లైతీవు జిల్లాలోని ముల్లైవైక్కల్‌లో ప్రభాకరన్‌ను ప్రభుత్వ దళాలు చంపినట్లు ప్రకటించాయి.
శ్రీలంకలో చైనాను నిరోధించాలి: నెడుమారన్
'తమిళ్ దేశీయ తలైవర్' ప్రభాకరన్ మరణం గురించి ఇక పుకార్లను విరమించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రపంచ తమిళ సమాఖ్య ప్రెసిడెంట్ నెడుమారన్ వివరించారు. తమిళ జాతి విముక్తి కోసం ప్రభాకరన్ త్వరలో ఒక ప్రణాళికను ప్రకటించబోతున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచంలోని తమిళ ప్రజలందరూ కలిసి ఆయనకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. పెట్టుబడుల ద్వారా శ్రీలంకలో చైనా తన ప్రభావాన్ని విస్తరింపజేస్తోందని ఈ సందర్భంగా నెడుమారన్ చెప్పారు. ద్వీప దేశంలో చైనా తన ఉనికిని పటిష్టం చేయకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలను ప్రారంభించాలని భారత ప్రభుత్వానికి ఉద్బోధించారు. ఎల్‌టీటీఈ బలంగా ఉన్నప్పుడు భారత్‌ను వ్యతిరేకిస్తున్న ఏ దేశాన్ని శ్రీలంకలో అడుగు పెట్టేందుకు తాము అనుమతించలేదని నెడుమారన్ గుర్తు చేసుకున్నారు.