తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి
తమిళనాడు పేరును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 'తమిళగం' అని సంభోదించడంపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడు వ్యాప్తంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపథ్యంలో గవర్నర్ రవి స్పందించారు. తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం తనకు లేదని గవర్నర్ రవి చెప్పారు. తాను 'తమిళగం' సంభోదించడం వెనుక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే, తనపై తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ఈ వివాదానికి ముగింపు పలికేందుకే తాను ఈ వివరణ ఇస్తున్నట్లు గవర్నర్ ఆర్‌ఎన్ రవి పేర్కొన్నారు.
తమిళ ప్రజలు, కాశీ మధ్య చారిత్రక సాంస్కృతిక అనుబంధం: గవర్నర్
తమిళ ప్రజలు, కాశీ మధ్య చారిత్రక సాంస్కృతిక అనుబంధం ఉందని చెప్పారు గవర్నర్ రవి. ఆ కోణంలోనే తాను 'తమిళగం' అని సంభోదించినట్లు పేర్కొన్నారు. ఆ రోజుల్లో తమిళనాడు లేదన్నారు. అందుకే, చారిత్రక సాంస్కృతిక సందర్భంలో తాను తమిళగం అనే పదాన్ని వినియోగించినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సముచితమైన వ్యక్తీకరణగా ఆయన వివరించారు. తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ రవి మధ్య చాలా రోజులుగా ప్రభుత్వానికి గవర్నర్‌కు సఖ్యత లేదు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మార్చి.. గవర్నర్ రవి చదవడంతో వివాదం ముదరింది. ఈ సమయంలో అధికార డీఎంకే శాసనసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసమయంలోనే ఆయన 'తమిళగం'గా గవర్నర్ సంభోదించారు.