సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో చాలా రోజులుగా ప్రభుత్వానికి గవర్నర్‌కు సఖ్యత లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మార్చి.. గవర్నర్ టీఎన్ రవి చదవడంతో వివాదం మరింత ముదరింది. ఈ సమయంలో అధికార డీఎంకే శాసనసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ రవి ప్రసంగానికి వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ సంఘటతో గవర్నర్- ప్రభుత్వం మధ్య వివాదం ముదిరి పాకాక పడింది.
గవర్నర్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు
అసెంబ్లీ పరిణామం అనంతరం తమిళనాడు అంతటా గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. చెన్నైలో గవర్నర్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆ తర్వాత.. సోషల్ మీడియాలోనూ గవర్నర్ వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల వర్షం కురిసింది. ఇవన్ని చేసిందంతా.. డీఎంకే శ్రేణులేనని ప్రచారం జరుగుతోంది. అలాగే.. తమిళనాడు పేరును 'తమిళగం'గా గవర్నర్ మార్చడంపై కూడా రాష్ట్రంలో పెద్ద వివాదమే చెలరేగింది. దీనిపై అన్ని పార్టీలు గవర్నర్‌పై విరుచుకుపడ్డాయి. పొంగల్ ఆహ్వాన పత్రికపై కూడా.. తమిళనాడు ముద్రను గవర్నర్ తొలగించి.. కేంద్ర ప్రభుత్వ ముద్రను వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా రాజ్ భవన్ ఎదుట నిరసన తెలిపే ఆలోచనలో డీఎంకే శ్రేణులు ఉన్నట్లు సమాచారం.