'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్
ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ముంబయిలో ఒక వ్యక్తి ఉగ్రదాడికి పాల్పడతాడని అందులోని సారాంశం. బెదిరింపు మెయిల్ రావడంతో నగర పోలీసులు, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తాలిబన్‌తో సంబంధం ఉన్న వ్యక్తి ముంబైలో దాడి చేస్తారని ఆ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. బెదిరింపు సందేశాన్ని పంపడానికి ఉపయోగించిన ఇమెయిల్ చిరునామాలో 'CIA' అని ఉంది.
మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ పాకిస్తాన్‌కు చెందినదిగా గుర్తింపు
బెదిరంపు ఈ మెయిల్‌పై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు విచారణ ప్రారంభించారు. మెయిల్ పంపిన ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామా పాకిస్తాన్‌కు చెందినదని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఇంతకుముందు కూడా దర్యాప్తు ఏజెన్సీకి ఇటువంటి ఈ-మెయిల్‌లు వచ్చిన నేపథ్యంలో ఇది అల్లరి మూకల పని కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థకు గత నెలలో ఇలాంటి ఈ-మెయిల్ వచ్చింది. దానిపై విచారణ చేపట్టగా, అది ఫేక్ కాల్ అని తేలింది.