ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో రేపోలి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. వేగంగా వస్తున్న కారును ట్రక్కు వేగంగా వచ్చిన ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
నాలుగేళ్ల బాలికకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మరణించిన తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి, ఐదుగురు పురుషులు ఉన్నారు. అలాగే ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక గాయపడింది. విషయం తెలుసుకున్న గోరేగావ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో చిన్నారిని రక్షించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలో ఏడాదికేడాది రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. 2022లో జనవరి- సెప్టెంబర్ మధ్య మహారాష్ట్రలో 24,360 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు రాష్ట్ర రవాణా శాఖ నివేదకలు చెబుతున్నాయి. 2022లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం 11,149 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021తో పోలిస్తే 2022లో 1,272 ఎక్కువ మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.