T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో రెండో సెమీస్ పోరు.. వాంఖడేలో ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం జరగనున్న సెమీఫైనల్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు సెమీస్‌కు చేరిన విధానం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచినా, ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. సూపర్-8 దశలో కూడా భారత జట్టు కొంత తడబడింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి జట్టుకు గట్టి హెచ్చరికగా మారింది.
వివరాలు
సూపర్-8 దశలో చివరి మ్యాచ్ ఆడకముందే సెమీఫైనల్‌కు ఇంగ్లాండ్ అర్హత
అయితే క్వార్టర్‌ఫైనల్ తరహా కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి భారత్ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
మరోవైపు ఇంగ్లాండ్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. సూపర్-8 దశలో చివరి మ్యాచ్ ఆడకముందే ఆ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
అయినప్పటికీ టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాకు మంచి రికార్డు ఉండటం భారత్‌కు ధైర్యం ఇస్తోంది.
అందువల్ల ఈ రెండు బలమైన జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా మారనుంది.
వివరాలు
జోరు కొనసాగిస్తాడా?
సెమీఫైనల్ దాకా చేరుకున్నప్పటికీ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ ప్రపంచకప్‌లో అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయలేదనే అభిప్రాయం ఉంది.
అయితే ఈ మ్యాచ్ సొంతగడ్డపై జరుగుతుండటం,అదీ భారత్‌కు మంచి రికార్డు ఉన్న వాంఖడే స్టేడియంలో జరగడం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.
ఇక ఓపెనర్ సంజు శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు ఆత్మవిశ్వాసాన్నిపెంచుతోంది.
వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో అతడు ఆడిన అద్భుత ఇన్నింగ్స్ (97 నాటౌట్) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు మంచి అవకాశాలు ఉంటాయి.
తిలక్ వర్మ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఇంకా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.
వివరాలు
జోరు కొనసాగిస్తాడా?
అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన అతడు ఇప్పటివరకు నిరాశపరిచాడు.
ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. అతడి సగటు 13.33 మాత్రమే.
జింబాబ్వేపై ఒక్క మ్యాచ్‌లో తప్ప మిగతా మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోయాడు.
ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతడు ఇబ్బందులు పడుతున్నాడు.
ఈ కీలక మ్యాచ్‌లో అయినా అతడు పుంజుకుంటాడా అనే విషయం ఆసక్తికరంగా మారింది.
వివరాలు
బౌలింగ్, ఫీల్డింగ్‌పై ఆందోళన
టోర్నీ ప్రారంభంలో మెరుగ్గా కనిపించిన ఇషాన్ కిషన్ తర్వాత మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోయాడు.
పరుగుల పరంగా వెనుకబడ్డాడు. అభిషేక్ శర్మతో కలిసి అతడు కూడా మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ప్రదర్శనలో స్థిరత్వం లేకపోవడం భారత్‌కు మరో సమస్యగా మారింది.
ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ల్లో అతడు ఎక్కువ పరుగులు సమర్పించాడు.
వాంఖడే మైదానంలో బౌండరీలు చిన్నగా ఉండటం వల్ల వరుణ్, అక్షర్ పటేల్ ఇద్దరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంగ్లాండ్ హిట్టర్లు శిక్షించే అవకాశం ఉంది.
వివరాలు
బౌలింగ్, ఫీల్డింగ్‌పై ఆందోళన
బుమ్రా మాత్రం ఎప్పటిలాగే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే చివరి అయిదు ఓవర్లలో భారత పేసర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి.
అర్ష్‌దీప్ సింగ్ వికెట్లు తీస్తున్నప్పటికీ ఎక్కువ పరుగులు ఇవ్వడం జట్టుకు సమస్యగా మారుతోంది.
ఫీల్డింగ్‌లో కూడా టీమ్ ఇండియా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మిస్ ఫీల్డింగ్, క్యాచ్‌లు చేజారడం వల్ల ఇప్పటికే కొన్ని మ్యాచ్‌ల్లో భారత్ నష్టపోయింది.
తండ్రి మరణంతో కొద్ది రోజుల పాటు జట్టుకు దూరమైన రింకు సింగ్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు.
అయితే ఫామ్‌లో లేకపోవడం వల్ల అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది.
గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్
సూపర్-8 దశలో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్‌కు సిద్ధమైంది.
ఆ జట్టులోని చాలామంది ఆటగాళ్లు భారత్‌లో అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం కలిగి ఉండటం వారికి అనుకూలంగా మారింది.
ఇక్కడి పిచ్‌లు,పరిస్థితులు వారికి కొత్తవి కావు. సాల్ట్,బ్రూక్,బెతెల్,బాంటన్ వంటి ఆటగాళ్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
జాక్స్, సామ్ కరన్ కూడా బ్యాటింగ్‌లో ప్రభావం చూపగలరు. అయితే ఓపెనర్ జోస్ బట్లర్ ఫామ్ మాత్రం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
ఏడు మ్యాచ్‌ల్లో అతడు కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు.
అతడి సగటు 8.85 మాత్రమే. ఈ కీలక మ్యాచ్‌లో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శన ఇవ్వాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.
వివరాలు
స్పిన్‌పై భారత్‌కు పరీక్ష
ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. సంజు శాంసన్‌ను షార్ట్ బంతులతో జోఫ్రా ఆర్చర్ పరీక్షించే అవకాశం ఉంది.
పవర్‌ప్లేలో అభిషేక్ శర్మను ఆఫ్ స్పిన్‌తో జాక్స్ ఇబ్బంది పెట్టే అవకాశముంది.
లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ రూపంలో ఇంగ్లాండ్‌కు మరో ఇద్దరు మంచి స్పిన్నర్లు ఉన్నారు. మధ్య ఓవర్లలో రషీద్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడం భారత్‌కు కీలకం.
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు స్పిన్ బౌలింగ్‌పై టీమ్ ఇండియా పెద్దగా ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది.
మ్యాచ్‌లో పైచేయి సాధించాలంటే స్పిన్నర్లపై దాడి చేసి పరుగులు సాధించడం అవసరం.
వివరాలు
సెమీస్ గెలిస్తే కప్పు?
భారత్, ఇంగ్లాండ్ జట్లకు ఇది వరుసగా మూడో ప్రపంచకప్ సెమీఫైనల్ కావడం విశేషం.
2022లో జరిగిన సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. అయితే 2024లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి, ఇంగ్లాండ్‌ను 103 పరుగులకే కట్టడి చేసింది.
ఆ రెండు సార్లూ సెమీస్ గెలిచిన జట్టు చివరికి కప్పు కూడా గెలుచుకుంది. మరి ఈసారి అదే సెంటిమెంట్ కొనసాగుతుందా అన్నది ఆసక్తికరం.
వివరాలు
భారత్ 17.. ఇంగ్లాండ్ 12
టీ20ల్లో ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియాకే పైచేయి ఉంది. ఇరు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో భారత్ 17 విజయాలు సాధించగా, ఇంగ్లాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది.
గత ఆరు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ ఐదు విజయాలు సాధించింది.
స్వదేశంలో ఇంగ్లాండ్‌పై భారత్ 10 మ్యాచ్‌లు గెలవగా, ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ప్రపంచకప్‌లలో కూడా భారత్‌కే ఆధిపత్యం ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్ మూడు (2007, 2012, 2024) గెలిచింది. 2009, 2022లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
వివరాలు
పిచ్, వాతావరణం
ఈ సెమీఫైనల్ మ్యాచ్ గ్రూప్ దశలో వెస్టిండీస్-ఇంగ్లాండ్, నేపాల్-ఇటలీ మ్యాచ్‌లకు ఉపయోగించిన పిచ్‌పైనే జరగనుంది.
అయితే ఫిబ్రవరి 12 తర్వాత ఈ పిచ్‌ను ఉపయోగించలేదు. అందువల్ల ఇది తాజాగా ఉంటుంది.
పిచ్‌పై కొద్దిగా పచ్చిక ఉండటంతో 200కు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
మంచి బౌన్స్ లభించే అవకాశముంది.స్పిన్నర్లకు కూడా కొంత టర్న్ దొరకొచ్చు. మ్యాచ్ సమయంలో వర్షం ముప్పు లేదని అంచనా.
వాంఖడే స్టేడియంలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఏడు టీ20 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచింది. 2017తర్వాత అక్కడ భారత్ ఓడిపోలేదు.
ఈ మైదానంలో ఇంగ్లాండ్ ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడింది.అందులో మూడు గెలిచి,మూడు ఓడిపోయింది.
ఇక్కడ భారత్,ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొకటి గెలిచాయి.
వివరాలు
తుది జట్లు (అంచనా)...
భారత్: అభిషేక్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్, దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి;
ఇంగ్లాండ్: సాల్ట్, బట్లర్, బ్రూక్ (కెప్టెన్), బెతెల్, బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, ఒవర్టన్, డాసన్, ఆర్చర్, అడిల్ రషీద్.