LOADING...
Trump: ట్రంప్ సుంకాల సొమ్ము రిఫండ్ చేయాలి: వాణిజ్య న్యాయస్థానం
ట్రంప్ సుంకాల సొమ్ము రిఫండ్ చేయాలి: వాణిజ్య న్యాయస్థానం

Trump: ట్రంప్ సుంకాల సొమ్ము రిఫండ్ చేయాలి: వాణిజ్య న్యాయస్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

టారిఫ్‌ల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి మరోసారి చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్‌లో ఉన్న అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పులో, ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల రూపంలో వసూలైన మొత్తాన్ని దిగుమతిదారులకు తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. 1977లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది విధించిన భారీ సుంకాలను అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెల్లవని ప్రకటించిన విషయం తెలిసిందే.

వివరాలు 

న్యాయస్థాన తీర్పుతో ఆ ప్రక్రియపై కొంత స్పష్టత

ఈ నేపథ్యంలో 'అట్మస్ ఫిల్ట్రేషన్' అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థాన న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దిగుమతిదారులు సుంకాల రూపంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ సుంకాల తిరిగి చెల్లింపుకు సంబంధించిన కేసులను తానే పర్యవేక్షిస్తానని వెల్లడించారు. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని మాత్రమే పేర్కొనగా, తిరిగి చెల్లింపుల విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజా న్యాయస్థాన తీర్పుతో ఆ ప్రక్రియపై కొంత స్పష్టత వచ్చినట్లైంది. ఇదిలా ఉండగా, ఈ నిర్ణయంపై అప్పీల్ చేస్తామని ట్రంప్ యంత్రాంగం తరఫు న్యాయవాది తెలిపారు.

వివరాలు 

సుంకాలపై అభ్యంతరం తెలపడానికి దిగుమతిదారులకు 180రోజుల గడువు

అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులన్నీ సాధారణంగా సుంకాలు,సరిహద్దు రక్షణ విభాగం పర్యవేక్షణలో 'లిక్విడేషన్' అనే ప్రక్రియలోకి వెళ్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు నిర్ణయించిన సుంకాలపై అభ్యంతరం తెలియజేయడానికి దిగుమతిదారులకు 180రోజుల గడువు ఉంటుంది. ఆ గడువులోగా అభ్యంతరం వ్యక్తం చేయకపోతే అధికారులు నిర్ణయించిన మొత్తాన్నితప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో,ప్రస్తుతం లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్న దిగుమతులపై సుంకాలు వసూలు చేయడం నిలిపివేయాలని న్యాయమూర్తి సుంకాలు,సరిహద్దు రక్షణ విభాగాన్నిఆదేశించారు. ఇప్పటికే లిక్విడేషన్ ప్రక్రియ పూర్తయిన వస్తువుల విషయంలో కూడా సుంకాలు లేకుండా మళ్లీ లెక్కలు వేసి సవరించాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో సుంకాల అంశంలో దిగుమతిదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement