Air India Express: అబుధాబి వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో తగ్గిపోయిన ఆయిల్
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ విమానంలో గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య తలెత్తింది. ఇంజిన్‌లో ఆయిల్ స్థాయి తగ్గడాన్ని పైలట్లు గుర్తించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని తిరిగి కొచ్చి విమానాశ్రయం వైపు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం ఈ విమానం అబుధాబికి బయల్దేరింది. టేకాఫ్ అయిన దాదాపు 50 నిమిషాల తర్వాత తొలి ఇంజిన్‌లో ఆయిల్ తగ్గుతున్నట్లు పైలట్లు గుర్తించారు. అదే సమయంలో ఆయిల్ ప్రెజర్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ముందు జాగ్రత్తగా ఆ ఇంజిన్‌ను నిలిపివేశారు.
వివరాలు
కొచ్చి వైపు మళ్లింపు
మరో ఇంజిన్‌తోనే ప్రయాణం కొనసాగించడం సురక్షితం కాదని భావించిన పైలట్లు విమానాన్ని వెంటనే కొచ్చి వైపు మళ్లించారు.
ఒక్క ఇంజిన్ సాయంతో సుమారు 45 నిమిషాల పాటు ప్రయాణించిన విమానం.. పైలట్ల అప్రమత్తత, సమయస్ఫూర్తితో కొచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఘటనపై విమానయాన సంస్థ స్పందించింది.
సమస్యకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అంతర్గత విచారణ కొనసాగుతోందని వెల్లడించింది.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు ఘటనపై అధికారిక దర్యాప్తు చేపట్టాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సంబంధిత అధికారులను ఆదేశించింది.
వివరాలు
అమృత్‌సర్ విమానాశ్రయం వద్ద అనుమానాస్పద డ్రోన్లు
అమృత్‌సర్ విమానాశ్రయం పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్లు కనిపించడంతో కలకలం రేగింది.
భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలో ఈ విమానాశ్రయం ఉండటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏడు విమానాలను ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
డ్రోన్ల కదలికల నేపథ్యంలో విమానాశ్రయ కార్యకలాపాలను కూడా కొన్ని గంటలపాటు నిలిపివేశారు.
విమానాశ్రయం ప్రహరి గోడకు వెలుపల పలువురు డ్రోన్లు అనుమానాస్పద రీతిలో ఎగురుతూ కనిపించినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు వెల్లడించారు.
ఘటనపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు.