Air India: ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులకు ముందే పలు లోపాలు.. మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు గురైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. విమానం ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల మేర కిందకు జారిపోయింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఈ కుదుపుల సమయంలో విమానంలో కేవలం టర్బులెన్స్ మాత్రమే కాకుండా.. పలు సాంకేతిక సమస్యలు కూడా తలెత్తినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు నమోదైనట్లు తెలిపాయి.
వివరాలు
ఆటోపైలట్ డిస్‌కనెక్ట్
విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒకదాని తర్వాత మరొకటి సాంకేతిక లోపాలు ఎదురైనట్లు సమాచారం.
తొలుత విమానంలోని ఆటోపైలట్ మోడ్ డిస్‌కనెక్ట్ అయ్యింది. దీంతో కో-పైలట్ విమానాన్ని మాన్యువల్‌గా నియంత్రించాల్సి వచ్చింది.
ఆ తర్వాత 'ఫ్లైట్ కంట్రోల్ స్టాల్' హెచ్చరిక సందేశం కనిపించింది. విమానం రెక్కలు అవసరమైన లిఫ్ట్‌ను కోల్పోయే పరిస్థితిని ఈ హెచ్చరిక సూచిస్తుంది.
వివరాలు
ఇండికేటర్ స్విచ్‌లలోనూ సమస్యలు
ఇదే సమయంలో విమానంలోని పలు ఇండికేటర్ స్విచ్‌లు కొద్దిసేపు పనిచేయకుండా నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో పాటు మరికొన్ని సాంకేతిక, యాంత్రిక సమస్యలు కూడా వెలుగుచూశాయని తెలిపాయి.
ఈ వరుస పరిణామాలు చోటుచేసుకున్న సమయంలోనే విమానం తీవ్ర కుదుపులకు గురై ఒక్కసారిగా కిందకు జారినట్లు వివరించాయి.
ఈ విషయాలను సంబంధిత వర్గాలు 'పీటీఐ' వార్తాసంస్థకు వెల్లడించాయి.
వివరాలు
ఏఏఐబీ దర్యాప్తు
ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగిస్తోంది.
విమానంలో చోటుచేసుకున్న సాంకేతిక సమస్యలు, కుదుపులకు దారితీసిన పరిస్థితులు, హైడ్రాలిక్ వ్యవస్థలో నమోదైన వైఫల్యాలు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు ఈ విమానాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థ తయారు చేసిన నేపథ్యంలో.. ఆ సంస్థకు చెందిన నిపుణులతో పాటు ఫ్రాన్స్ బ్యూరో ఆఫ్ ఎంక్వైరీ అండ్ అనాలిసిస్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ (బీఈఏ) అధికారులు కూడా భారత్‌కు రానున్నారు.
దర్యాప్తులో భారత అధికారులకు వారు సహకరించనున్నారు.
వివరాలు
విమానంలో 145 మంది
ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 145 మంది ఉన్నారు.
వీరిలో 137 మంది ప్రయాణికులు కాగా, మరో ఎనిమిది మంది విమాన సిబ్బంది.
దిల్లీ విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్య బృందాలు గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించాయి. బాధితులకు అక్కడ వైద్య చికిత్స అందించారు.