Loading...
Air India: ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రైస్‌ పైలట్లందరికీ ఇకపై డోప్‌ టెస్ట్‌ తప్పనిసరి
ఎయిర్ ఇండియా పైలట్లందరికీ ఇకపై డోప్‌ టెస్ట్‌ తప్పనిసరి

Air India: ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రైస్‌ పైలట్లందరికీ ఇకపై డోప్‌ టెస్ట్‌ తప్పనిసరి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రైస్‌లో పనిచేస్తున్న పైలట్లందరికీ ఇకపై డోప్‌ టెస్ట్‌ తప్పనిసరి కానుంది. ఇటీవల ఫుకెట్‌-దిల్లీ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో పైలట్‌-ఇన్‌-కమాండ్‌ గంజాయి సేవించినట్లు డ్రగ్‌ పరీక్షల్లో నిర్ధారణ కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు నిర్వహిస్తున్న ర్యాండమ్‌ డ్రగ్‌ టెస్టులకు అదనంగా.. సంస్థలోని అంతర్గత తనిఖీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం నుంచే పైలట్లకు డోప్‌ టెస్టులు నిర్వహించే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

వివరాలు 

శిక్షణ సమయంలోనూ పరీక్షలు

గురుగ్రామ్‌లోని ఎయిర్ ఇండియా అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో పైలట్లకు డోప్‌ టెస్టులు నిర్వహిస్తారు.

అలాగే విమాన ప్రయాణం పూర్తయిన తర్వాత కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ బ్రీఫింగ్‌ సెంటర్లు, కార్యాలయాల్లో ఈ పరీక్షలు చేపట్టనున్నారు.

ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, సంస్థలో పారదర్శకతను కొనసాగించడంతో పాటు అత్యున్నత భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ఉద్దేశమని ఎయిర్ ఇండియా తెలిపింది.

ఈ మేరకు ఉద్యోగులకు పంపిన లేఖలో సంస్థ వివరించింది. ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రైస్‌ సంస్థల్లో కలిపి దాదాపు 5వేల మంది పైలట్లు పనిచేస్తున్నారు.

వీరందరూ ఇకపై కొత్త డోప్‌ టెస్ట్‌ విధానానికి లోబడి ఉండనున్నారు.

వివరాలు 

ఇదీ నేపథ్యం

థాయిలాండ్‌లోని ఫుకెట్‌ నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం ఆగస్టు 4న ప్రయాణిస్తున్న సమయంలో తీవ్ర కుదుపులకు గురైంది.

ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 145 మంది ఉన్నారు.

ఈ ఘటన తర్వాత విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లకు డ్రగ్‌ పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో నిర్వహించిన పరీక్షల్లో పైలట్‌-ఇన్‌-కమాండ్‌కు డ్రగ్‌ టెస్ట్‌ పాజిటివ్‌గా వచ్చింది.

అనంతరం మరింతగా నిర్ధారించేందుకు సైకోయాక్టివ్‌ పరీక్ష నిర్వహించగా.. అతడు గంజాయి సేవించినట్లు తేలింది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎయిరిండియా తన అంతర్గత భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తూ పైలట్లందరికీ డోప్‌ టెస్టులను తప్పనిసరి చేసింది.

ADVERTISEMENT