Air India Pilot: ఎయిర్ ఇండియా పైలట్‌కు డ్రగ్ టెస్ట్ పాజిటివ్.. లైసెన్స్ రద్దవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం AI2379 ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయి.. అందులోని 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. విమానంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే.. విమాన కెప్టెన్‌కు నిర్వహించిన పరీక్షలో ఫలితం పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ విషయం నిర్ధారణ అయితే.. విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పైలట్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది.
వివరాలు
పైలట్ రెండో పరీక్షలో ఏం తేలింది?
మంగళవారం (ఆగస్టు 11) ఎయిర్ ఇండియా నుంచి పదవీ విరమణ చేయనున్న సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించారు.
ఈ సమావేశంలో పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న AI2379 విమానం ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు కోల్పోవడంతో పలువురు గాయపడ్డారు.
ఈ ఘటన తర్వాత విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు తొలుత పరీక్షలు నిర్వహించారు.
మద్యం సేవించారా లేదా తెలుసుకునేందుకు ఇద్దరికీ బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా.. అందులో ఇద్దరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది
అనంతరం సైకోట్రోపిక్ పదార్థాల వినియోగాన్ని గుర్తించేందుకు రక్తం, మూత్రం నమూనాలను సేకరించారు.
వివరాలు
పైలట్ రెండో పరీక్షలో ఏం తేలింది?
విమాన కెప్టెన్‌కు నిర్వహించిన తొలి డ్రగ్ పరీక్షలో ఫలితం అనుమానాస్పదంగా రావడంతో.. అతడి నమూనాలను నిర్ధారణ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
ప్రాథమిక పరీక్షలో నాన్-నెగెటివ్ ఫలితం వచ్చినప్పుడు నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా నిర్వహిస్తారు.
ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు, మందుల కారణంగా తొలిసారి చేసే స్క్రీనింగ్‌లో తప్పుడు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు కెప్టెన్ నమూనాలకు నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గా వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అందులో గంజాయి (మారిజువానా) పదార్థం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
వివరాలు
పైలట్ రెండో పరీక్షలో ఏం తేలింది?
తాజా పరిణామంతో ఓ ప్రయాణికుడు గతంలో చేసిన ఆరోపణలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
విమానం బయలుదేరే ముందు పైలట్ మత్తులో ఉన్నట్లుగా కనిపించాడని, ఆయన కళ్లు ఎర్రగా ఉన్నాయని ఆ ప్రయాణికుడు పేర్కొన్నారు.
ఓ ప్రయాణికుడు NDTVతో మాట్లాడుతూ.. "నేను, నా సోదరుడు చివరిగా విమానం ఎక్కాం. పైలట్ కూడా మాతోపాటే విమానంలోకి వచ్చారు. 'విమానం సమయానికి బయలుదేరుతుందా? మేం ఆలస్యంగా వచ్చామా?' అని అతనిని అడిగాను.
ఆయన చాలా నెమ్మదిగా స్పందించారు. ఆయన కళ్లు కూడా ఎర్రగా కనిపించాయి. అప్పుడే ఆయన మత్తులో ఉన్నట్లు అనిపిస్తోందని నా సోదరుడితో చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు" అని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫ్లైట్‌లో ఏం జరిగింది?
Air India: Phuket - Delhi, 04.08.2026.
— Minchen (@minchen_t) August 4, 2026
The worst two hours of my life. Please, please, please always wear your seatbelt on a plane, even when the seatbelt sign is off.
I saw people being thrown into the air, hitting their heads, and getting injured. For a while, I genuinely… pic.twitter.com/3bVjcZZ18g
వివరాలు
ఘటన సమయంలో పైలట్ తీరుపై ప్రయాణికుల సంచలన ఆరోపణలు
ఘటన జరిగిన సమయంలో పైలట్ కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చి..ఆ దృశ్యాలను రికార్డు చేయవద్దని ప్రయాణికులను కోరినట్లు కూడా సదరు ప్రయాణికుడు ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలో పైలట్ "బాత్ కా బతంగడ్ బన్ జాయేగా" (చిన్న విషయాన్ని పెద్దది చేస్తారు)అని చెప్పినట్లు పేర్కొన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఘటన సమయంలో విమానంలో ఉన్న కొందరు ప్రయాణికులు పైలట్ ఫ్లైట్ డెక్‌లో తరచూ నేలపై కూర్చునేవారని,సిగరెట్ తాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించారని తెలిపారు.
ఆయనను తిరిగి సీటులో కూర్చోబెట్టేందుకు క్యాబిన్ సిబ్బంది సహాయం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
విమానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తనపై పూర్తి నియంత్రణలో లేనట్లు కనిపించారని,నడవడానికి ఇబ్బంది పడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాలు
ఎయిర్ ఇండియా విమానం కాక్‌పిట్‌లో ఏం జరిగింది?
ఆగస్టు 4న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎత్తు కోల్పోవడానికి దారితీసిన పరిణామాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.
విమానం ఎత్తు కోల్పోయిన సమయంలో కెప్టెన్ తన సీటులో లేరని తెలుస్తోంది.
ఆయన కో-పైలట్ సీటు వెనుక నిలబడి ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో విమానం స్టాల్ అవుతున్నట్లు కాక్‌పిట్‌లో హెచ్చరికలు వెలువడ్డాయి.
ఆ సమయంలో ఆటోపైలట్ డిస్‌ఎంగేజ్ అయింది. దీంతో కో-పైలట్ శిక్షణలో నేర్చుకున్న స్టాల్ రికవరీ విధానాన్ని అనుసరించి విమానం ముందు భాగాన్ని కిందికి దించారు.
దీంతో విమానం 'నెగెటివ్ జీ' పరిస్థితిలోకి వెళ్లింది. విమానంలో సీటు బెల్టుతో లేదా ఇతర విధంగా బిగించి ఉంచని వస్తువులు పైకి తేలిపోయే పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
ఇప్పుడు పైలట్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఆ తర్వాత కెప్టెన్ తిరిగి తన సీటులోకి వచ్చి విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నారు.
వేగం, ఎత్తు మరింత తగ్గకుండా ఆపేందుకు థ్రాటిల్‌ను గరిష్ఠ నిరంతర థ్రస్ట్ స్థాయికి పెంచినట్లు సమాచారం.
పైలట్ డ్రగ్ టెస్ట్ ఫలితంపై అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ధారణ లేదు.
అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అధ్యక్షుడు కెప్టెన్ సీఎస్ రంధావా న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. "పైలట్‌ను జీవితాంతం విధులకు దూరంగా ఉంచాలి. ప్రజల ప్రాణాలతో ఆయన ఆటలాడకూడదు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా డీజీసీఏ స్థానంలో మరింత మెరుగైన పర్యవేక్షణ కలిగిన సివిల్ ఏవియేషన్ అథారిటీ అవసరం" అని అన్నారు.
వివరాలు
ఇప్పుడు పైలట్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
"ఎయిర్ ఇండియా ఇలాంటి విషయాల్లో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుంది. అందువల్ల ఆయనను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగికి తొలిసారి డ్రగ్ టెస్ట్ పాజిటివ్‌గా వస్తే,అతడిని ప్రత్యేక వైద్యుడు,కౌన్సిలర్ లేదా డీ-అడిక్షన్ కేంద్రానికి పంపించి పునరావాస కార్యక్రమంలో భాగం చేస్తారు.
తిరిగి విధుల్లో చేరాలనుకుంటే.. కొత్తగా పరీక్ష చేయించుకోవాలి.అందులో నెగెటివ్ ఫలితం రావడంతో పాటు సంస్థ వైద్య విభాగం నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి.
అయితే ఉద్యోగికి ఇది మొదటిసారి కాకపోతే నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి.
రెండోసారి డ్రగ్ టెస్ట్ పాజిటివ్‌గా వస్తే అతడి లైసెన్స్‌ను మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తారు.మూడోసారి కూడా పాజిటివ్ ఫలితం వస్తే లైసెన్స్‌ను రద్దు చేస్తారు.
వివరాలు
ఇప్పుడు పైలట్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
అంతేకాదు.. డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి నిరాకరించడం కూడా పాజిటివ్ ఫలితంతో సమానమైన తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
డ్రగ్ పరీక్షకు నిరాకరించిన ఉద్యోగిని వెంటనే విధుల నుంచి తప్పిస్తారు. 48 గంటల్లోగా మరోసారి పరీక్ష చేయించుకుని ఫలితాన్ని ఇవ్వాలి. అలా చేయకపోతే.. అతడి లైసెన్స్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తారు.
ఒకసారి పరీక్షకు నిరాకరించిన తర్వాత నిర్వహించే పరీక్షలో పాజిటివ్‌గా తేలినా, లేదా రెండోసారి డ్రగ్ టెస్ట్‌కు నిరాకరించినా.. పైలట్ లైసెన్స్‌ను మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తారు.
ఆ తర్వాత కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి.
వివరాలు
ఇప్పుడు పైలట్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఇంతకుముందే పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా పైలట్ నిషేధిత పదార్థాలను వినియోగించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పైలట్ నిషేధిత పదార్థాలు తీసుకున్నట్లు తేలితే ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. అవసరమైతే ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడానికి కూడా వెనుకాడం" అని ఆయన మీడియాతో అన్నారు.