Loading...
Air India Pilot: ఫుకెట్-ఢిల్లీ విమానంలో తీవ్ర కుదుపులు.. పైలట్‌కు డోప్ టెస్ట్‌లో పాజిటివ్
ఫుకెట్-ఢిల్లీ విమానంలో తీవ్ర కుదుపులు.. పైలట్‌కు డోప్ టెస్ట్‌లో పాజిటివ్

Air India Pilot: ఫుకెట్-ఢిల్లీ విమానంలో తీవ్ర కుదుపులు.. పైలట్‌కు డోప్ టెస్ట్‌లో పాజిటివ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నఎయిర్ ఇండియా విమానం తీవ్ర కుదుపులకు గురైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత నిర్వహించిన డోప్ టెస్ట్‌లో పైలట్ ఇన్ కమాండ్ విఫలమైనట్లు సమాచారం. ఆయనకు డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై తుది నివేదిక ఇంకా అందలేదని ఎయిరిండియా యాజమాన్యం స్పష్టం చేసింది. విచారణ కొనసాగుతోందని తెలిపింది.ఆగస్టు 4న థాయిలాండ్‌లోని ఫుకెట్ నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో 137 మంది ప్రయాణికులు,ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణ సమయంలో విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. అనంతరం తీవ్ర కుదుపులకు గురైంది. దాదాపు ఐదునిమిషాల పాటు విమానం గాల్లో ఊగిసలాడినట్లు సమాచారం.

వివరాలు 

13 మంది ప్రయాణికులు,నలుగురు సిబ్బందికి గాయాలు 

ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

అనంతరం విమానం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

నిబంధనల ప్రకారం విమానం దిగిన తర్వాత ఇద్దరు పైలట్లకు పోస్ట్ ఫ్లైట్ డ్రగ్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు.

ఈ పరీక్షలో పైలట్ ఇన్ కమాండ్‌కు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు సమాచారం.

దీంతో సంబంధిత పైలట్‌కు మరో సైకోయాక్టివ్ పరీక్ష కూడా నిర్వహించారు.

వివరాలు 

విధుల నుంచి ఇద్దరు పైలట్లను తప్పించిన ఎయిర్ ఇండియా 

అయితే ఆ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

ఈ ఫలితాలు వచ్చిన తర్వాతే వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఈ ఘటనపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విచారణ చేపట్టింది.

దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానానికి సంబంధించిన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించినట్లు ఎయిరిండియా వెల్లడించింది.

తుది నివేదిక అందిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై స్పష్టత రానుంది.

ADVERTISEMENT