Al Falah University: మధ్యప్రదేశ్‌లో అల్-ఫలా ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ అక్రమ నిర్మాణాలు..!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ బాంబు దాడి కేసు నేపథ్యంలో అల్-ఫలా యూనివర్సిటీ పేరు వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఈ విశ్వవిద్యాలయం ఛైర్మన్‌గా ఉన్న జావెద్ సిద్దిఖీ గురించి ఇప్పుడు మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో ఆయన కుటుంబానికి చెందిన కొన్ని నిర్మాణాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. మోవ్ కాంటోన్మెంట్ బోర్డు పరిధిలో, జావెద్ అహ్మద్ సిద్దిఖీ కుటుంబ సభ్యులు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్టు అధికారులకు తెలిసింది. దీంతో, మూడు రోజుల వ్యవధిలో ఆ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు ఇచ్చారు.
వివరాలు
బోర్డే స్వయంగా కూల్చివేత పనులు
కాంటోన్మెంట్ ఇంజినీర్ హెచ్.ఎస్. కలోయా మాట్లాడుతూ.. "జావెద్ తండ్రి ఇంట్లో అనధికారికంగా చేసిన మార్పులు, నిర్మాణాలను తొలగించమని మేము ఇప్పటికే పలు మార్లు నోటీసులు జారీ చేశాం. కానీ వారు స్పందించలేదు. అందుకే మళ్లీ మూడు రోజుల్లోగా వాటిని కూల్చివేయాలని తాజా నోటీసులు పంపాం" అని వెల్లడించారు. ఆదేశాలను పట్టించుకోకపోతే, బోర్డే స్వయంగా కూల్చివేత పనులు చేపట్టే ప్రసక్తి ఉందని, ఆ ఖర్చును కుటుంబం నుంచి వసూలు చేస్తామని కూడా స్పష్టం చేశారు.
వివరాలు
విద్యార్థుల నుంచి దాదాపు రూ. 415 కోట్లు వసూలు
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడులో కీలక పాత్ర పోషించిన డాక్టర్ ఉమర్ నబీ,ఈ అల్-ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌ను విచారించే ప్రక్రియలోనే ఈ పేలుడు బయటపడింది. ఆ మాడ్యూల్ దర్యాప్తులో,అక్కడి వ్యక్తులు అల్-ఫలా యూనివర్సిటీతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కూడా తేలింది. ఈ పరిణామాల తర్వాత దిల్లీ పోలీసులు వర్సిటీపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. దీనితో పాటు, మంగళవారం ఈడీ వర్సిటీ ప్రధాన కార్యాలయం సహా మరో 24 చోట్ల దాడులు నిర్వహించింది. అల్-ఫలా గ్రూప్ ఛైర్మన్ జావెద్ సిద్దిఖీని అరెస్టు చేసింది. నకిలీ అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి దాదాపు రూ. 415 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.