All about ERONET: ఓటరు జాబితాలో భారీ మార్పులు.. ఎరోనెట్, ఈసీఐనెట్‌పై ఎందుకీ చర్చ?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల్లో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం (ఈసీ)కు చెందిన రెండు డిజిటల్ వ్యవస్థలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అవే.. ఎరోనెట్, ఈసీఐనెట్. ఓటరు జాబితా డేటాబేస్‌ను కేంద్రీకరించడం, ఈ వ్యవస్థలపై రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారులకు ఎంత మేర నియంత్రణ ఉందన్న అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషీలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఓ వార్తాసంస్థ కథనం వెల్లడించింది. అసలు ఈ రెండు వ్యవస్థలు ఏమిటి? వాటి అవసరం ఎందుకు వచ్చింది? వాటి పనితీరు ఎలా ఉంటుంది? అనే విషయాలను పరిశీలిస్తే..
వివరాలు
ఓటరు జాబితా నిర్వహణకు ఎరోనెట్
ఎరోనెట్, ఈసీఐనెట్ పరస్పరం అనుసంధానమై ఉన్నప్పటికీ రెండూ ఒకే వ్యవస్థలు కావు.
ఎరోనెట్ ప్రధానంగా ఓటరు జాబితా నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఉపయోగించే బ్యాక్‌ఎండ్ అప్లికేషన్.
ఓటరుగా నమోదు చేయడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పుడు వివరాలను మార్చడం,రికార్డుల్లో తప్పులను సరిచేయడం, అర్హత లేని ఓటర్లను తొలగించడం వంటి ప్రక్రియల్లో దీన్ని వినియోగిస్తారు.
ఎరోనెట్ అందుబాటులోకి రాకముందు దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ ఓటరు జాబితాలను నిర్వహించేందుకు వేర్వేరు అప్లికేషన్లు, డేటాబేస్‌లను ఉపయోగించేవి.
ఇలా ఉపయోగించిన ప్రత్యేక వ్యవస్థల సంఖ్య దాదాపు 36 వరకు ఉండేది.
దేశవ్యాప్తంగా ఓటరు సమాచారాన్ని మరింత సమన్వయంతో నిర్వహించేందుకు కేంద్రీకృత డేటాబేస్ అవసరమైంది.
వివరాలు
ఈఆర్‌వోలకు సహాయకారి
ఈ అవసరాన్ని తీర్చడంలో ఎరోనెట్ కీలక పాత్ర పోషించింది. ఎన్నికల సంఘం దీన్ని ఓటరు జాబితా ప్రక్రియకు సంబంధించిన కేంద్రీకృత ప్రాసెసింగ్ వ్యవస్థగా పేర్కొంటోంది.
అయితే ఓ వ్యక్తిని ఓటరు జాబితాలో చేర్చాలా? వద్దా? అనే తుది నిర్ణయాన్ని ఎరోనెట్ స్వయంగా తీసుకోదు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాల తయారీ, వాటిలో మార్పులు,చేర్పుల బాధ్యత ఓటరు నమోదు అధికారులే (ఈఆర్‌వో) బాధ్యులు.
ఈ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ఎరోనెట్ వారికి సాంకేతికంగా సహాయపడుతుంది.
ఉదాహరణకు.. రెండు వేర్వేరు ఎంట్రీల్లో ఒకే పేరు,వయసు,ఇతర వ్యక్తిగత వివరాలు సరిపోలుతున్నట్లు వ్యవస్థ గుర్తిస్తే.. అవి ఒకే వ్యక్తికి సంబంధించిన డూప్లికేట్ నమోదులు కావచ్చని ఎరోనెట్ అధికారులను అప్రమత్తం చేస్తుంది.
వివరాలు
ఈసీఐనెట్‌తో ఒకే వేదికపైకి..
అయితే దీనర్థం ఆ రెండు పేర్లను వెంటనే తొలగిస్తారని కాదు.
ఈఆర్‌వోలు సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ, ధ్రువీకరణ చేపట్టి.. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు.
ఈసీఐనెట్ అనేది ఎరోనెట్ కంటే విస్తృతమైన డిజిటల్ వేదిక. దీన్ని ఈ ఏడాది జనవరి 22న ప్రారంభించారు.
ఓటర్లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులకు అందించే సేవలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు.
ఎన్నికల సంఘం గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేసిన 40కి పైగా అప్లికేషన్లు, వెబ్‌సైట్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఈసీఐనెట్‌ను ఏర్పాటు చేశారు.
వివరాలు
ఈసీఐనెట్‌తో ఒకే వేదికపైకి..
ఓటర్లు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓటు నమోదు, దరఖాస్తుల స్థితి తెలుసుకోవడం, ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం, తమ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవడం వంటి సేవలను పొందవచ్చు.
ఓటరు జాబితాల నిర్వహణకు సంబంధించి గతంలో ఎరోనెట్ ద్వారా చేపట్టిన అనేక కార్యకలాపాలను కూడా ఇప్పుడు ఈసీఐనెట్‌లోకి అనుసంధానించారు.
సరళంగా చెప్పాలంటే.. ఎరోనెట్ ప్రధానంగా ఓటరు జాబితాల నిర్వహణ కోసం రూపొందించిన బ్యాక్‌ఎండ్ వ్యవస్థ. ఈసీఐనెట్ మాత్రం ఓటరు జాబితాల నిర్వహణతో పాటు ఎన్నికలకు సంబంధించిన అనేక ఇతర సేవలను కూడా ఒకే డిజిటల్ వేదికపై అందించే విస్తృత ప్లాట్‌ఫామ్.
వివరాలు
నియంత్రణ స్థాయిపైనే ప్రశ్నలు!
ఓటరు జాబితాలను డిజిటల్, కేంద్రీకృత వ్యవస్థ ద్వారా నిర్వహించడం కొత్త పరిణామం కాదు.
అయితే ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశం.. ఈ కేంద్రీకరణ ఎంతవరకు ఉండాలి? అలాగే ఓటరు జాబితాలపై నిర్ణయాలు తీసుకునే స్థానిక, రాష్ట్రస్థాయి అధికారులు ఎరోనెట్, ఈసీఐనెట్ వంటి వ్యవస్థలపై తగినంత నియంత్రణ కలిగి ఉన్నారా? అన్నదే.
ఈ విషయంలో గోవాలో ఎస్‌ఐఆర్ సందర్భంగా జరిగిన పరిణామాలను ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు.
అక్కడ కొందరు ఓటర్ల వివరాల్లో పాత, ప్రస్తుత ఓటరు జాబితాల మధ్య పేర్లలో తేడాలు ఉండటం, తల్లిదండ్రులు-పిల్లల వయసుల మధ్య సహజంగా ఉండాల్సినంత వ్యత్యాసం లేకపోవడం వంటి వైరుధ్యాలను డేటాబేస్ గుర్తించింది.
వివరాలు
నియంత్రణ స్థాయిపైనే ప్రశ్నలు!
ఆ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం 97 మంది ఓటర్లు తుది జాబితాలో చేర్చడానికి అర్హులేనని ఈఆర్‌వోలు గుర్తించినట్లు సమాచారం.
అయితే ఒకసారి తొలగించిన వారి పేర్లను తిరిగి ఓటరు జాబితాలో పునరుద్ధరించేందుకు అవసరమైన ఆప్షన్ సంబంధిత అధికారులకు అందుబాటులో లేకపోయింది.
దీంతో పేర్లను పునరుద్ధరించేందుకు అవసరమైన 'రోల్‌బ్యాక్' ఆప్షన్ కల్పించాలని గోవా ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి వచ్చింది.
ఈ పరిణామం ఓటరు జాబితా నిర్వహణలో సాంకేతిక వ్యవస్థలు, వాటిపై నిర్ణయాధికారుల నియంత్రణ మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో చర్చకు తెచ్చింది.