ఆదిపురుష్ యూనిట్ పై అలహాబాద్ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వివాదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే సినిమాలో చూపించిన పాత్రలు, సన్నివేశాలు రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై గతంలోనే కోర్టు నిర్మాతలను విచారించింది. ఈ కేసులో కో రైటర్ మనోజ్ ముంతాషీర్ శుక్లాను సైతం భాగస్వామిగా చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజులలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రామాయణం మనకు ఆదర్శమని, ప్రజలు ఇళ్ల నుంచి బయలుదేరే ముందు రామచరితమానస్‌ని చదువుతారని పేర్కొంది. సినిమాలు కొన్ని విషయాల జోలికి వెళ్లకూడదని కోర్టు హితవు పలికింది.
అభ్యంతరకరమైన డైలాగులను ఇప్పటికే తొలగించాం: డిప్యూటీ సొలిసిటర్ జనరల్
హిందూ మతానికి చెందిన ప్రజలు చాలా సహనంతో ఉంటారన్న న్యాయమూర్తి, దీన్ని కూడా పరీక్షిస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ పనితీరు బాధ్యతను సక్రమంగా నెరవేర్చిందా లేదా అనే కోణంలోనూ కోర్టు ప్రశ్నలు కురిపించింది. సినిమాలో అభ్యంతరకరమైన డైలాగులను ఇప్పటికే తొలగించామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ చర్య ఒక్కటే సరిపోదని, అసలు ఆ సీన్లను ఏం చేస్తారనేదానిపై చిత్ర యూనిట్ నుంచి వివరణ తీసుకోవాలని సూచించింది. మరోవైపు కోట్లాది ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్నందున చిత్ర ప్రదర్శన నిలిచిపోతే ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.