Amit Shah: చర్చకు నేను రెడీ.. రాహుల్ గాంధీకి ఆసక్తి లేదు: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలకు కీలక ప్రతిపాదన చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సభలోనే ఉంటానని తెలిపారు. ఈ 24 గంటల వ్యవధిలో ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నీట్ విద్యార్థుల ఆందోళనల సమయంలో జరిగిన పోలీసుల చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతోపాటు అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరపాలని కోరుతున్నాయి. ఈ డిమాండ్ల కారణంగా సభా కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
వివరాలు
ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తానని షా ప్రకటన
చర్చకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటే అధికారికంగా లేఖ ఇవ్వాలని అమిత్ షా సూచించారు.
లేఖ అందిన వెంటనే బుధవారం మధ్యాహ్నం 3గంటల నుంచి చర్చ ప్రారంభిద్దామని చెప్పారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు,అంటే మొత్తం 24గంటల పాటు చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని షా మరోసారి స్పష్టం చేశారు.
చర్చ జరపాలా? లేక సభా కార్యకలాపాలను కొనసాగకుండా అడ్డుకోవాలా?అనే నిర్ణయాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలే తీసుకోవాలని అన్నారు.
పార్లమెంట్‌కు తాను హాజరు కావడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా అమిత్ షా ఖండించారు.
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా సభకు హాజరవుతున్నానని తెలిపారు.
వివరాలు
ఇక ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్య
పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నది ప్రతిపక్షమేనని షా ఆరోపించారు.
సభకు వచ్చి పదేపదే కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
నీట్ విద్యార్థుల ఆందోళనల అంశంపై చర్చకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని అమిత్ షా తెలిపారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ అంశానికి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
"చర్చకు వారు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయించాలి" అని అమిత్ షా వ్యాఖ్యానించారు.