Loading...
Amritsar: అమృత్‌సర్‌ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం.. 7 విమానాలు దారి మళ్లింపు
అమృత్‌సర్‌ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం.. 7 విమానాలు దారి మళ్లింపు

Amritsar: అమృత్‌సర్‌ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం.. 7 విమానాలు దారి మళ్లింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌ దాస్‌ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం నెలకొంది. రన్‌వే సమీపంలో రెండు నుంచి నాలుగు అనుమానాస్పద డ్రోన్లు లేదా డ్రోన్లను పోలిన వస్తువులు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజాలా గ్రామం వైపు నుంచి విమానాశ్రయం దిశగా వచ్చిన ఈ గుర్తుతెలియని వస్తువులు.. రన్‌వేతో పాటు ఇతర కీలక ప్రాంతాలపై కొన్ని నిమిషాల పాటు సంచరించినట్లు సమాచారం. డ్రోన్లు కనిపించిన విషయాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) వెంటనే విమానాశ్రయ భద్రతా సంస్థలకు తెలియజేసింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అమృత్‌సర్‌కు రావాల్సిన ఏడు విమానాలను దిల్లీ, చండీగఢ్‌కు దారి మళ్లించారు.

వివరాలు 

ఎయిర్‌ఫీల్డ్‌ పరిధిలో డ్రోన్లు

వీటిలో కౌలాలంపూర్‌ నుంచి వస్తున్న మలేసియా ఎయిర్‌లైన్స్‌ MH-118, ముంబయి నుంచి వచ్చే ఇండిగో 6E-5028, దిల్లీ నుంచి వచ్చే ఇండిగో 6E-2045, ఎయిర్‌ ఇండియా AI-479 విమానాలు ఉన్నాయి.

రాత్రి 9.50 గంటల నుంచి 11.15 గంటల వరకు విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

విమానాశ్రయ డైరెక్టర్‌ అనిరుధ్‌ కుమార్‌ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పలు విమానాలు ల్యాండ్‌ కావాల్సిన సమయంలో ఎయిర్‌ఫీల్డ్‌ పరిధిలో డ్రోన్లు కనిపించినట్లు భారత వైమానిక దళం నుంచి సమాచారం వచ్చింది.

దీంతో డ్రోన్లు కనిపించినప్పుడు అనుసరించే ప్రామాణిక విధానాల ప్రకారం జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించారు.

వివరాలు 

రెండు విమానాలను చండీగఢ్‌కు, మరో ఐదు విమానాలను దిల్లీకి

డ్రోన్ల కదలికల వల్ల విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని కమిటీ అంచనా వేయడంతో విమానాశ్రయాన్ని మూసివేయాలని నిర్ణయించారు.

విమానాశ్రయ కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాకకు సిద్ధంగా ఉన్న ఏడు విమానాలను దారి మళ్లించారు.

వీటిలో రెండు విమానాలను చండీగఢ్‌కు, మరో ఐదు విమానాలను దిల్లీకి పంపించారు.

రాత్రి 11 గంటల సమయంలో పరిస్థితిని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మరోసారి సమీక్షించింది. అప్పటికి డ్రోన్ల కదలికలు కనిపించకపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని నిర్ధారించింది.

దీంతో రాత్రి 11.15 గంటల నుంచి విమానాశ్రయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు.

ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని విమానాశ్రయ డైరెక్టర్‌ తెలిపారు.

ADVERTISEMENT