Gold Looted: అమృత్‌సర్‌లో కలకలం.. జ్యువెలరీ వ్యాపారిపై అటాక్, రూ.60 లక్షల బంగారం చోరీ
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లో పట్టపగలే భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. జ్యువెలరీ వ్యాపారం చేసే ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి, సుమారు రూ.60 లక్షల విలువైన బంగారాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన అమృత్‌సర్‌లోని న్యూ ఫ్లవర్ స్కూల్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. సీ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నేరం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడిని ముక్తియార్ సింగ్‌గా గుర్తించారు. ఆయన అమృత్‌సర్‌లోని సుల్తాన్‌విండ్ ప్రాంతంలో జ్వెలరీ షోరూమ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, దాడి జరిగిన సమయంలో ముక్తియార్ సింగ్ వద్ద 425 గ్రాముల బంగారం ఉన్నట్లు తేలింది.
Details
కారులో వచ్చి కత్తులతో దాడి
గురువారం షోరూమ్ నుంచి ఇంటికి బంగారాన్ని తీసుకెళ్లిన ముక్తియార్, శుక్రవారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై వెళ్లుతూ ఓ కస్టమర్‌కు బంగారం అందించేందుకు బయల్దేరాడు. ఈ క్రమంలోనే న్యూ ఫ్లవర్ స్కూల్ వద్ద నలుపు రంగు కారులో వచ్చిన దుండగులు అతడిపై దాడికి దిగారు. మొదట మోటార్‌సైకిల్‌ను కారుతో ఢీకొట్టి కిందపడేసిన దుండగులు, సుమారు పది మంది వరకు అతడిని వెంటాడి, పదునైన ఆయుధాలు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతడి వద్ద ఉన్న బంగారాన్ని లూటీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ముక్తియార్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు.
Details
గ్యాంగ్ స్టర్లు బెదిరించినట్లు సమాచారం
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే కొంతకాలంగా కొందరు గ్యాంగ్‌స్టర్లు ముక్తియార్‌ను బెదిరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చిన బెదిరింపులే ఈ దాడికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు సంఘటన స్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.