Andhra Pradesh: 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన.. మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో విధులకు సక్రమంగా హాజరుకాకుండా, బాధ్యతల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైద్యులపై కూటమి ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. సుదీర్ఘకాలంగా ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది ప్రభుత్వ వైద్యులను ప్రభుత్వం తాజాగా ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇదే తరహాలో వ్యవహరిస్తున్న మరో 193 మంది వైద్యులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. 70 మంది వైద్యుల తొలగింపునకు నిర్ణయం ప్రభుత్వ వైద్యుల గైర్హాజరు,వారిపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి సత్యకుమార్‌కు అందజేశారు.
వివరాలు
మరో 193 మందిపై చర్యలు
డీఎస్‌హెచ్, డీఎంఈ అధికారులు ఈ నివేదికను సమర్పించారు. వివరాలను పరిశీలించిన అనంతరం 70 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
సుదీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉంటున్న మరో 193 మంది ప్రభుత్వ వైద్యులపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఈ వ్యవహారంలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
వివరాలు
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించొద్దు
ప్రభుత్వ వైద్యులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యతలో నిర్లక్ష్యం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మేలో 51 మంది వైద్యుల తొలగింపు
ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరవుతున్న 51 మంది వైద్యులను ఈ ఏడాది మే నెలలోనే కూటమి ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది.
తాజాగా మరో 70 మందిపై వేటు వేయడంతో ప్రభుత్వ వైద్యుల అనధికార గైర్హాజరుపై ప్రభుత్వం కఠిన వైఖరి కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.