ఏపీ పర్యాటకానికి జోష్; 3 ఒబెరాయ్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన
గండికోట, వైజాగ్, తిరుపతిలో 7 స్టార్ ఒబెరాయ్ హోటల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శిలాఫలకాలను ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ హోటళ్ల నిర్మాణం పూర్తయితే, రాష్ట్ర పర్యాటక రంగానికి దోహదపడుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 2023లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒబెరాయ్ గ్రూప్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి అనుగుణంగా అదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక కీలక ప్రసంగం చేశారు. గండికోట ప్రపంచ పర్యాటక పటంలో చోటు దక్కించుకోవడానికి ఈ పరిణామం దోహదపడుతుందని అన్నారు.
స్టార్ హోటల్‌తో వైఎస్సార్ జిల్లాకు మరింత ప్రాచుర్యం: సీఎం జగన్
గండికోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ఈ హోటళ్ల నిర్మాణం దోహదపడుందని సీఎం జగన్ అన్నారు. అలాగే 500 నుంచి 800 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఒబెరాయ్ హోటల్ రిసార్ట్ యాంకర్ పాత్రను పోషిస్తుందన్నారు. 7-స్టార్ హోటల్ సౌకర్యంతో వైఎస్ఆర్ జిల్లా ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతుందన్నారు. ఇక్కడ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు గల అవకాశాలను అన్వేషించాలని విక్రమ్ ఒబెరాయ్‌ను అభ్యర్థించినట్లు సీఎం జగన్ చెప్పారు. అనంతరం విక్రమ్ ఒబెరాయ్ మాట్లాడుతూ, ఇక్కడ రానున్న హోటల్, రిసార్ట్ సదుపాయం ఆర్థిక వృద్ధికి ఇంజిన్‌గా పనిచేస్తుందన్నారు. యువతకు ఉపాధిని కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.