Loading...
COVID-19: ఏపీలో 12 కొత్త కొవిడ్ కేసులు.. నలుగురు మృతి 

COVID-19: ఏపీలో 12 కొత్త కొవిడ్ కేసులు.. నలుగురు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో తాజాగా 12 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి నలుగురు మరణించినట్లు తెలిపారు. మృతుల్లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు,కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మరణించిన వారందరూ ఇప్పటికే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వివరించారు. కొవిడ్ వైరస్ జన్యు క్రమ స్వరూపాన్ని(జీనోమ్ సీక్వెన్సింగ్)గుర్తించేందుకు ఐదు నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపినట్లు వెల్లడించారు. నమోదైన మొత్తం 12 కేసుల్లో వైఎస్సార్ కడప జిల్లాలో ఎనిమిది, గుంటూరు జిల్లాలో రెండు, విశాఖపట్నం,కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలిపారు.

వివరాలు 

ముందుజాగ్రత్తలు పాటించాలి 

ఈ కేసుల్లో ఇద్దరు బాధితులు ఇప్పటికే కొవిడ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారేనని అధికారులు గుర్తించారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే తప్పనిసరిగా ముందుజాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది.

జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.

వివరాలు 

కొవిడ్ సన్నద్ధతపై ప్రశ్నలు

తాజా కొవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర సర్వైలెన్స్ విభాగం అప్రమత్తమైంది.

జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు (డీఎంహెచ్‌వోలు), ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు (జీజీహెచ్‌లు), బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఇప్పటికే అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది.

పాజిటివ్ కేసుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని, ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లు, వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం (వీటీఎం) కిట్లు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ నిల్వలు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

కొవిడ్ సన్నద్ధతపై ప్రశ్నలు

అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.

అనేక ఆసుపత్రుల్లో కొవిడ్ ప్రత్యేక వార్డులు సిద్ధం చేసినప్పటికీ, రోగుల గొంతు, ముక్కు నుంచి స్వాబ్ నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపేందుకు అవసరమైన వీటీఎం కిట్లు అందుబాటులో లేవని సమాచారం.

అలాగే వైద్య సిబ్బందికి అత్యంత అవసరమైన పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్) కిట్ల కొరత కూడా కొనసాగుతోంది.

రాష్ట్రంలో 2020లో కొవిడ్ తీవ్రంగా విజృంభించిన సమయంలో సుమారు 7.50 కోట్ల విలువైన పీపీఈ కిట్లు కొనుగోలు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

కొవిడ్ సన్నద్ధతపై ప్రశ్నలు

అయితే వాటి గడువు 2025లో ముగియడంతో దాదాపు 45 లక్షల కిట్లు వినియోగానికి పనికిరాక వృథాగా మారాయి.

ప్రస్తుతం కొత్తగా పీపీఈ కిట్లు కొనుగోలు చేయాలంటే ఒక్కో కిట్‌కు సుమారు రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇదిలా ఉండగా, కొవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన పలు ఆక్సిజన్ ప్లాంట్లు ప్రస్తుతం నిర్వహణ లేక వినియోగానికి దూరంగా ఉన్నాయని సమాచారం.

తాజా పరిస్థితుల దృష్ట్యా అవసరమైన వైద్య పరికరాలు, రక్షణ సామగ్రి, ఆక్సిజన్ సదుపాయాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT