Andhra Pradesh: ఏపీలో ఆయుష్ సేవల అభివృద్ధికి రూ.257 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయుష్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రూ.257 కోట్ల నిధులు మంజూరు చేయాలని నేషనల్ ఆయుష్ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆయుష్ వార్షిక ప్రణాళిక నిధుల సాధనలో తీవ్ర వైఫల్యం చోటుచేసుకుందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుష్ రంగానికి కేంద్రం నుంచి నిధుల కేటాయింపులు గణనీయంగా పెరిగాయని మంత్రి చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.85 కోట్లు, 2025-26లో రూ.166 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.
వివరాలు
కేంద్ర యోగా-ప్రకృతి వైద్య పరిశోధన కేంద్రం కోసం గుంటూరు సమీపంలో 15 ఎకరాల భూమి
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని, సిద్ధ వైద్యుల కోసం నిర్వహిస్తున్న మూడు రోజుల రాష్ట్రస్థాయి పునశ్చరణ, శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్య శాఖ తరహాలోనే ఆయుష్, ఆహార భద్రత శాఖల్లో కూడా 'జీరో వేకెన్సీ' విధానాన్ని అమలు చేసే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు.
కేంద్ర యోగా-ప్రకృతి వైద్య పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం రూ.100 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ప్రతిపాదించామని, ఇందుకు గుంటూరు సమీపంలో 15 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు.
వివరాలు
విశాఖపట్నంలో రూ.70 కోట్లతో నేచురోపతి వైద్య కళాశాల
రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరం ప్రాంతాల్లో ఒక్కో చోట రూ.15 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అలాగే ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ఒక్కో ప్రాజెక్టుకు రూ.70 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
విశాఖపట్నంలో రూ.70 కోట్లతో నేచురోపతి వైద్య కళాశాల కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు.
వివరాలు
మొత్తం 58 రకాల శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
ఆయుర్వేదంలోని శల్యతంత్ర, శలాక్యతంత్ర విభాగాల్లో మొత్తం 58 రకాల శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి వివరించారు.
ఈ శిక్షణ శిబిరంలో కేంద్ర ప్రభుత్వ హోమియోపతి సలహాదారు డాక్టర్ ప్రీతా కిజకుట్టిల్ హోమియో వైద్యశాలల్లో పాటించాల్సిన చికిత్సా విధానాలు, ప్రమాణాలపై వైద్యులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ యోగా, నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణరాజు ప్రజల ఆరోగ్యానికి అనుకూలమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో అవసరమైన మార్పులపై సూచనలు చేశారు.