Andhra Pradesh: ఏపీకి విదేశీ పెట్టుబడుల జోరు.. 2025-26లో ఎఫ్‌డీఐలు భారీ పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను వెల్లడిస్తూ, రాష్ట్రంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం గతంతో పోలిస్తే వేగంగా పెరిగిందని పేర్కొంది. కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 92.13 మిలియన్ డాలర్లు (సుమారు రూ.760 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అనంతరం 2024-25 నాటికి ఈక్విటీ రూపంలో వచ్చిన విదేశీ పెట్టుబడులు 233.14 మిలియన్ డాలర్లకు పెరిగినట్లు తెలిపింది.
వివరాలు
రూ.5వేల కోట్లకు పైగా ఎఫ్‌డీఐలు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడి
అదే వేగం 2025-26లో మరింత పెరిగి, రాష్ట్రానికి 608.59మిలియన్ డాలర్ల (రూ.5వేల కోట్లకు పైగా) ఎఫ్‌డీఐలు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విధానాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడుల ప్రవాహం ఆశించిన స్థాయిలో లేకపోయిందని కూడా కేంద్రం పేర్కొంది.
2025-26లో రంగాల వారీగా పరిశీలిస్తే లోహ పరిశ్రమ అత్యధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఈ రంగంలో 250.67 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి.
ఆ తర్వాత ఆహార శుద్ధి పరిశ్రమలో 107.30 మిలియన్ డాలర్లు, సిమెంట్ ఉత్పత్తుల రంగంలో 99.90 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు వివరించింది.
అలాగే సేవల రంగం, పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగాల్లో కలిపి 59.96 మిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదైనట్లు తెలిపింది.
వివరాలు
పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' చర్యలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
2023-24లో 92.13 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు, 2025-26 నాటికి 608.59 మిలియన్ డాలర్లకు చేరడం రాష్ట్రంలో పెట్టుబడుల వృద్ధికి నిదర్శనమని వివరించింది.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం వల్ల అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా లోహ, ఆహార శుద్ధి, సిమెంట్ రంగాల్లో నమోదైన భారీ పెట్టుబడులు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నాయని స్పష్టం చేసింది.