Khamenei-Masoud Pezeshkian: మొజ్తాబా ఖమేనీయేనా..? చీకటి గదిలో భేటీపై కొత్త అనుమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారనే వార్తలు వెలువడినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian)తో ఆయన రహస్యంగా సమావేశమైనట్లు వచ్చిన కథనాలు ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చాయి. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం,టెహ్రాన్‌లోని అత్యంత భద్రత కలిగిన రహస్య ప్రాంతంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ముదురు రంగు అద్దాలు ఉన్న కారులో వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తిని మొజ్తాబా ఖమేనీగా పేర్కొంటున్నారు. అయితే,సమావేశం పూర్తిగా చీకటి గదిలో నిర్వహించడంతో ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖం కూడా స్పష్టంగా కనిపించలేదని సమాచారం.
వివరాలు
భద్రతా కారణాలతో మొజ్తాబా ఖమేనీ రహస్య ప్రదేశంలో భేటీ
అంతేకాదు, ఇద్దరూ కరచాలనం కూడా చేసుకోలేదని కథనాలు వెల్లడించాయి. దీంతో అధ్యక్షుడు కలిసింది నిజంగానే మొజ్తాబా ఖమేనీయేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఇరాన్ విప్లవ గార్డ్స్ (IRGC) వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధ్యక్షుడు పెజెష్కియాన్, అవసరమైతే రాజీనామా చేస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే.
అదే సమయంలో సుప్రీం లీడర్‌ను కలిసేందుకు ఆయన పలుమార్లు ప్రయత్నించినట్లు సమాచారం.
ఆ నేపథ్యంలోనే ఈ భేటీకి మొజ్తాబా ఖమేనీ అంగీకరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.
సాధారణంగా అధ్యక్షుడు-సుప్రీం లీడర్ సమావేశాలు ఖమేనీ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంటాయి.
అయితే ఈసారి మాత్రం భద్రతా కారణాలతో రహస్య ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
పెజెష్కియాన్‌కు మొజ్తాబా ముఖం కనిపించలేదని సమాచారం
సమావేశానికి ముందు అధ్యక్షుడికి ప్రత్యేకంగా సమాచారం అందించారని, ఇద్దరి మధ్య కొద్ది నిమిషాల పాటు మాత్రమే సంభాషణ జరిగినట్లు కథనాలు వెల్లడించాయి.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఖమేనీ భద్రతా సిబ్బంది అధ్యక్షుడికి సూచించినట్లు పేర్కొన్నాయి.
ఈ సమావేశంలో పెజెష్కియాన్‌కు మొజ్తాబా ముఖం కనిపించలేదని సమాచారం.
ఇద్దరూ కేవలం ఒకరి మాట మరొకరు వినగలిగే విధంగా మాత్రమే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించాయి.
ఈ వ్యవహారాన్ని అధ్యక్షుడు అవమానకరంగా భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్లు కథనాలు చెబుతున్నాయి.
మరోవైపు,ఇరాన్ పాలన క్రమంగా ఐఆర్‌జీసీ కమాండర్ల ఆధీనంలోకి వెళ్తోందని పెజెష్కియాన్ తన రాజీనామా లేఖలో హెచ్చరించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
వివరాలు
చర్చనీయాంశమైన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీలక నిర్ణయాల ప్రక్రియలో ప్రభుత్వ అధికారులను ఐఆర్‌జీసీ పక్కనపెడుతోందని ఆయన ఆరోపించినట్లు సమాచారం.
అయితే ఆ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, మరోసారి పెజెష్కియాన్ రాజీనామా చేస్తానని ప్రకటిస్తే, ఈసారి మొజ్తాబా ఖమేనీ దానిని ఆమోదించే అవకాశం ఉందంటూ ఇటీవల ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
మొజ్తాబా ఖమేనీ "90 శాతం చనిపోయినట్లే" ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరగడంతో ఇరాన్ రాజకీయ పరిణామాలపై మరింత ఆసక్తి నెలకొంది.