SIR: ఏపీలో 'సర్' గడువు మరో 10 రోజులు పొడిగింపు.. జూలై 24 వరకు ఇంటింటి సర్వే
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్-సర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మరో 10 రోజుల గడువు ఇచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ మంగళవారంతో ముగియాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఈ నెల 24 వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఈసీఐ విడుదల చేసిన సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. అనంతరం ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది. వాటి పరిశీలన అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.
వివరాలు
ఎన్నికల సంఘానికి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి లేఖ
గడువు పొడిగింపునకు సంబంధించి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణతో పాటు వాటి డిజిటైజేషన్ పనులు పూర్తయ్యేందుకు అదనంగా 10 రోజుల సమయం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదనకు మద్దతుగా రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వినతులతో పాటు కొన్ని జిల్లాల కలెక్టర్లు పంపిన నివేదికలను కూడా ఆయన లేఖకు జత చేశారు.
దీంతో పరిస్థితిని సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం గడువు పెంపునకు అంగీకరించినట్లు సమాచారం.
వివరాలు
పెండింగ్‌లో 5 నుంచి 10 శాతం వరకు డిజిటైజేషన్ పనులు
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియ మంగళవారంతో పూర్తికావాల్సి ఉంది.
అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంకా 5 నుంచి 10 శాతం వరకు డిజిటైజేషన్ పనులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక అనుమతితో గడువును పొడిగించాలని ఏపీ సీఈఓ చేసిన అభ్యర్థనకు ఈసీఐ సానుకూలంగా స్పందించింది.
గడువు పెరగడంతో మిగిలిన ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు డిజిటైజేషన్ పనులను కూడా నిర్దేశిత కాలవ్యవధిలో ముగించేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టనుంది.