Andhra Pradesh: డిసెంబరు నుంచి రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.100కే
ఈ వార్తాకథనం ఏంటి
రేషన్ దుకాణాల ద్వారా డిసెంబరు నుంచి కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్ రూ.125 చొప్పున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మార్కెట్లో కందిపప్పు ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, కంది సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో ధరల పరిస్థితి, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను 500కు పెంచాలని, టోల్గేట్లు, రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
వివరాలు
కూరగాయల ధరలు పెరగకుండా ముందస్తు చర్యలు
ఉల్లి, టమాటా ధరలు రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని అగ్రివాచ్ నివేదికలు వెల్లడిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.
కూరగాయల ధరలు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావం కారణంగా వివిధ పంటల దిగుబడుల్లో వచ్చే మార్పులను ముందుగానే అంచనా వేయాలని అధికారులకు చెప్పారు.
కృష్ణా డెల్టా వంటి ప్రాంతాల్లోనూ తక్కువ నీటితో సాగు చేయగల సన్నరకం వరి పంటలను ప్రోత్సహించాలని సూచించారు.
నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లోనే ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
సన్నరకం ధాన్యానికి అదనపు మద్దతు ధర కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సూచించారు.
వివరాలు
బియ్యం ధరలు 18 శాతం వరకు తగ్గుదల
గత నెలతో పోలిస్తే కొన్ని రకాల బియ్యం ధరలు 8 నుంచి 18 శాతం వరకు తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జై శ్రీరామ్ బియ్యం కిలో రూ.79 నుంచి రూ.82 వరకు, హెచ్ఎంటీ/ఆర్ఎన్ఆర్ రకాలు రూ.72 నుంచి రూ.76 వరకు, బీపీటీ బియ్యం రూ.64 నుంచి రూ.66 వరకు, సాధారణ రకం బియ్యం రూ.46 నుంచి రూ.48 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
బియ్యం ధరలపై ప్రభుత్వం అధికారిక ధరల పట్టికను ప్రకటించిందని చెప్పారు.
బియ్యం నిల్వలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
ఇదే సమయంలో ఉల్లి ధరలు 28 శాతం, పామాయిల్ ధరలు 5 శాతం తగ్గినట్లు వెల్లడించారు.
వివరాలు
ధరణి బియ్యానికి ప్రజల నుంచి మంచి స్పందన
ప్రభుత్వం ధరణి బ్రాండ్ పేరుతో అందిస్తున్న సూపర్‌ఫైన్ బియ్యానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని అధికారులు తెలిపారు.
బహిరంగ మార్కెట్లో కిలో రూ.76 ధర పలుకుతున్న కేఎన్ఎం/ఆర్ఎన్ఆర్ రకం బియ్యాన్ని ప్రభుత్వం రూ.50కే అందిస్తోందని చెప్పారు.
అలాగే మార్కెట్లో రూ.66 ఉన్న బీపీటీ ముడి బియ్యాన్ని రూ.49కే విక్రయిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ కేంద్రాల ద్వారా 59,662 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేశారు.
వివరాలు
ధరణి బియ్యానికి ప్రజల నుంచి మంచి స్పందన
ప్రజలకు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 286 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించకుండా విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ విభాగాల బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి.
ఇప్పటివరకు 1,558 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,005 కేసులు నమోదు చేశాయి.
ఈ తనిఖీల ద్వారా రూ.84.59 లక్షల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.