Avanti Srinivas: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కేవలం ఆ పార్టీ 11 సీట్లకే పరిమితం కావడంతో, పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ నుండి బయటకి వచ్చారు. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడారు. ఆ పార్టీ సభ్యత్వంతో పదవికి రాజనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ హాయాంలో అవంతి పర్యాటక శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇక వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ కార్యక్రమాలకు దూరమైన అవంతి, ఈ క్రమంలోనే రాజీనామా ప్రకటన చేశారు.
కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలి
తన హయాంలో, ప్రతి ఇంటిని టచ్ చేస్తూ ప్రజలతో నేరుగా మమేకమైనట్టు అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, తమ వైఫల్యాలను విశ్లేషించుకునే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. తన హయాంలో అవినీతి ఎక్కడా ప్రోత్సహించలేదని, ఏ తప్పు చేయలేదని చెప్పారు. అభివృద్ధి పనులు చేసినా స్థానిక నాయకులపై కాకుండా ఇతర స్థాయిల వారిపై ఆధారపడి తీసుకున్న నిర్ణయాలే ప్రజల్లో అసంతృప్తిని కలిగించాయని అవంతి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో స్థిరమైన పాలన ఉండడం వల్లనే ఆ రాష్ట్రం అభివృద్ధి సాధించగలిగిందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులతో తడబడిందని ఆయన వ్యాఖ్యానించారు.