NEET UG 2026: నీట్ రద్దుతో మరో విద్యార్థి బలి.. దేశవ్యాప్తంగా ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్ష రద్దు నిర్ణయం విద్యార్థులపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతుండగా, ఆత్మహత్య ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ప్రదీప్ మహిచ్ తన ఇద్దరు సోదరులతో కలిసి సికార్‌లో నివసిస్తూ నీట్ పరీక్ష కోసం ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షకు హాజరయ్యాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ప్రదీప్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాలు
పరీక్ష రద్దు కావడంతో తీవ్ర నిరాశ
ఈ విషయాన్ని గమనించిన అతడి సోదరి వెంటనే స్థానికుల సహాయంతో సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్ తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడు నీట్ పరీక్షను చాలా బాగా రాశానని చెప్పాడని, 650 మార్కులు వస్తాయని నమ్మకంగా తెలిపాడన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ మెడికల్ సీటు ఖాయమనే ఆశతో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర నిరాశ, మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై సచిన్ పైలట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో ఇప్పటికే న్యూఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌ల్లో కూడా విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.