తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి ఒక రాజ్యసభ, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. అందులో సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. మరొకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే.. మిగతా నలుగురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రధానంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఆ అవకాశం జీవీఎల్‌కే దక్కొచ్చా?
తెలంగాణలో బీజేపీకి ఉత్తర తెలంగాణ నుంచి ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. దక్షిణ తెలంగాణ కోటాలో ఎలాగూ.. కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నందున.. ఉత్తర తెలంగాణ కోటాలో.. బండిసంజయ్ లేదా అరవింద్‌కు కేంద్ర సహాయమంత్రి పదవి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సీనియార్టిని పరిగణలోకి తీసుకుంటే.. లక్ష్మణ్‌కు స్వతంత్ర లేదా కేంద్రమంత్రి హోదాను కట్టబెట్టే అవకాశం ఉంది. వీరిలో బండిసంజయ్, లక్ష్మణ్ ప్రస్తుతం పార్టీ కీలక పదవుల్లో ఉన్నారు. వీరికి ప్రభుత్వ పదవులు ఇచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఏపీలో బీజేపీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒకరు జీవీఎల్ నరిసింహరావు, ఇంకకరు సీఎం. రమేష్. కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పార్టీలో సీనియర్ అయిన జీవీఎల్‌కే అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది.