Loading...
AP Assembly: డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పెట్టుబడుల రక్షణ చట్టంపై కీలక నిర్ణయం!
పెట్టుబడుల రక్షణ చట్టంపై కీలక నిర్ణయం!

AP Assembly: డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పెట్టుబడుల రక్షణ చట్టంపై కీలక నిర్ణయం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను సుమారు 15 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు, కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'పెట్టుబడుల రక్షణ చట్టం' (ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్) బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశముంది.

వివరాలు 

పెట్టుబడులకు చట్టపరమైన భరోసా

రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడులకు రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం.

రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ పరిశ్రమలకు గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులు, ఇతర రాయితీల విషయంలో ఆకస్మికంగా విధానాలు మారకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ దిశగా పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా బిల్లును రూపొందిస్తున్నారు.

దేశంలోనే తొలిసారిగా ఈ తరహా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు.

వివరాలు 

రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు

ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి.

ఈ సదస్సులో దాదాపు రూ.9.89 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.

ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తల్లో మరింత విశ్వాసాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెట్టుబడులకు దీర్ఘకాలిక భద్రత కల్పించేందుకు పెట్టుబడుల రక్షణ చట్టాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని నిర్ణయించింది.

ఈ చట్టం తీసుకొచ్చే అంశంపై మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు.

పలువురు పెట్టుబడిదారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

ప్రభుత్వం దీనిపై తీవ్రంగా ఆలోచిస్తోందని, కచ్చితంగా చట్టాన్ని తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

సాగునీటి ప్రాజెక్టులపైనా చర్చ

పెట్టుబడుల రక్షణ చట్టంతో పాటు రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు.

ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటివరకు ఎంత మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి? మిగిలిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలి? భవిష్యత్తులో ప్రభుత్వం అనుసరించబోయే కార్యాచరణ ఏమిటి? అనే అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది.

మొత్తంగా డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో పెట్టుబడుల రక్షణ చట్టం, సాగునీటి ప్రాజెక్టులు ప్రధాన చర్చనీయాంశాలుగా మారనున్నాయి.

ADVERTISEMENT