Loading...
AP: ఉద్యోగుల క్యాడర్ విభజనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. ఆగస్టు 5లోపు ప్రక్రియ పూర్తి
ఆగస్టు 5లోపు ప్రక్రియ పూర్తి

AP: ఉద్యోగుల క్యాడర్ విభజనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. ఆగస్టు 5లోపు ప్రక్రియ పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణతో పాటు ప్రత్యక్ష నియామకాల నియంత్రణకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లుగా వర్గీకరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1975లో అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా తీసుకుని ఈ కొత్త క్యాడర్ వ్యవస్థను రూపొందించారు. ఇందులో రాష్ట్రాన్ని ఆరు జోన్లు,రెండు మల్టీ జోన్లుగా విభజించారు. అన్ని శాఖలు తమ పరిధిలోని పోస్టుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించగా,వాటి ఆధారంగా క్యాడర్ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

ప్రత్యక్ష నియామకాలలో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్

ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రకారం ఆగస్టు 5లోపు ఉద్యోగులను పాత జిల్లాలు,కొత్త జిల్లాల మధ్య విభజించే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రక్రియ అనంతరం భార్యాభర్తల (స్పౌజ్)కేటగిరీకి చెందిన ఉద్యోగుల అభ్యర్థన బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరించి,వాటిని ఆగస్టు 12లోపు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించింది.

కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యక్ష నియామకాలలో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.

మిగిలిన 5 శాతం పోస్టులు స్థానికేతర అభ్యర్థుల కోటాగా ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాలు, ప్రత్యేక కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రస్థాయి సంస్థలు, అలాగే రాజధాని ప్రాంత పరిధిలోని పోలీసు కమిషనరేట్ పోస్టులకు ఈ స్థానిక క్యాడర్ విధానం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వివరాలు 

కొత్త జిల్లాలకు తాత్కాలిక పోస్టుల కేటాయింపు

నియామకాలు, పదోన్నతులు, సీనియారిటీ, బదిలీలు, ఇతర సేవా అంశాల నిర్వహణలో జిల్లా, జోన్, మల్టీ జోన్లను స్వతంత్ర యూనిట్లుగా పరిగణిస్తారు.

గిరిజన సంక్షేమ శాఖలో ప్రధానోపాధ్యాయుల గ్రేడ్-2 పోస్టులను జోనల్ క్యాడర్‌గా నిర్ణయించగా, అన్ని శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జిల్లా క్యాడర్‌గా వర్గీకరించారు.

అన్ని శాఖల్లో క్యాడర్ విభజన పూర్తైన తర్వాత ఉద్యోగులను కొత్త, పాత జిల్లాల మధ్య కేటాయిస్తారు.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల షెడ్యూల్‌లో లేకపోయినా, అధికారికంగా చేర్చే వరకు ఆ జిల్లాలకు కూడా తాత్కాలికంగా పోస్టులను కేటాయించనున్నారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, కొత్త జిల్లాల్లో పనిచేయడానికి వారి నుంచి ఐచ్ఛికాలను స్వీకరిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

పదోన్నతులు, బదిలీలపై తాత్కాలిక నిషేధం

క్యాడర్ వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల ఉన్నతీకరణ, ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లపై ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది.

శాఖలకు మంజూరైన మొత్తం పోస్టులను క్యాడర్ స్ట్రెంత్‌గా పరిగణిస్తారు. ఆ సంఖ్య నుంచి ఖాళీలను మినహాయించి మిగిలిన వారిని వర్కింగ్ క్యాడర్‌గా గుర్తిస్తారు.

డిప్యుటేషన్, సెలవులు, శిక్షణ లేదా సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులను కూడా పనిచేస్తున్న సిబ్బందిగానే లెక్కిస్తారు.

ఉద్యోగుల కేటాయింపుకు ప్రత్యేక కమిటీలు

ఉద్యోగులను పాత, కొత్త జిల్లాల మధ్య కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది.

ADVERTISEMENT

వివరాలు 

జిల్లా స్థాయి కమిటీకి

ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, కొత్త జిల్లా కలెక్టర్ కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సంబంధిత శాఖ ఉమ్మడి జిల్లా అధికారి సభ్య కన్వీనర్‌గా, కొత్త జిల్లా అధికారి కో-కన్వీనర్‌గా ఉంటారు. కొత్త, పాత జిల్లాల రెవెన్యూ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు.

జోనల్ స్థాయి కమిటీకి సంబంధిత శాఖాధిపతి ఛైర్మన్‌గా ఉంటారు. జోన్ పరిధిలోని ఉమ్మడి, కొత్త జిల్లాల శాఖాధిపతులు సభ్యులుగా కొనసాగుతారు. శాఖాధిపతి నామినేట్ చేసిన జోనల్ హెడ్ లేదా సంబంధిత అధికారి సభ్య కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

రాష్ట్ర సచివాలయ స్థాయి కమిటీకి సంబంధిత శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు. కార్యదర్శి నామినేట్ చేసిన అధికారులు సభ్యులుగా, శాఖాధిపతి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

ADVERTISEMENT