స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పాత్రదారి చంద్రబాబు: ఏపీ సీఐడీ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ మాట్లాడారు. నంద్యాలలో ఉదయం 6గంటలకు చంద్రబాబ అరెస్ట్ చేశామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందని, దాదాపుగా రూ. 550 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తెలిపారు. తన వాటాగా ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 371కోట్లను డిజైన్ టెక్‌తో పాటు వేరే షెల్ కంపెనీలకు మళ్లినట్లు పేర్కొన్నారు. సీమెన్స్ తరఫున డిజైన్ టెక్ సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, ఒప్పందం జరిగేటప్పుడు డిజైన్ టెక్ సంస్థ ఉనికే లేదన్నారు.
ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం : సీఐడీ చీఫ్ సంజయ్
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో గంటా సుబ్బారావుకు 4 పదవులను కట్టబెట్టిన విషయాన్ని తాము గుర్తించినట్లు సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో షెల్ కంపెనీల ద్వారా జరిగిన కుంభకోణం విషయంలో మాజీ సీఎం చంద్రబాబు ప్రధాన కుట్రదారుగా భావిస్తున్నట్లు వివరించారు. వికాస్ కన్వెల్కర్‌తో పాటు ఇతర నిందితులు ఇందులో నిందితులుగా ఉన్నారన్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరముందన్నారు. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్, అంతర్గత రింగ్ రోడ్డు అక్రమాల్లో లోకేశ్ పాత్రపైనా విచారణ చేస్తామన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబును ప్రవేశపరుస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబే అంతిమ లబ్ధిదారుడని, ఆయనే కీలక పాత్రధారి అని భావించి అరెస్ట్ చేశామన్నారు.