అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. న్యాయమే గెలుస్తుందని ధీమా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను తప్పు చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అణిచివేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు అర్ధరాత్రి వచ్చి భయభ్రాంతులకు గురిచేశారని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత వారికి లేదా అంటూ నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్లాన్ ప్రకారమే అదుపులోకి తీసుకుంటున్నారని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందున్నారు. మరోవైపు పొదలాడ యువగళం క్యాంప్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్తున్న లోకేష్‌ను పోలీసులు అడ్డుకోగా ఆయన పోలీసులను ప్రశ్నించారు.
అరెస్ట్ ఎందుకు చేస్తున్నారో తెలియదు : లోకేశ్
తాను ఒక్కడినే తన తండ్రి వద్దకు వెళ్తానని, అడ్డుకునే హక్కు ఎవరిచ్చారంటూ లోకేశ్ పోలీసులను నిలదీశారు. ఈ మేరకు క్యాంప్ వద్ద బస్సు ముందే లోకేష్ బైఠాయించారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, చూసేందుకు వెళ్తున్న తనను నడిరోడ్డుపై ఎందుకు నిర్బంధించారని లోకేశ్ మండిపడ్డారు. తన పాదయాత్రపై వైకాపా రౌడీమూకలతో పోలీసులే దగ్గరుండి రాళ్లు వేయించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే యువగళం వలంటీర్లపై దాడి జరిగిందని ఫిర్యాదు ఇస్తే, తమపైనే రివర్స్ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడి(చంద్రబాబు)పై అవినీతి మచ్చ వేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.