ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు-2023 ప్రారంభం.. ఎప్పట్నుంచో తెలుసా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 24కి ఆరు నెలల గడువు తీరిపోనుంది. ఈ మేరకు ప్రతీ ఆరు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు సాగే సామావేశాల ముందు తొలుత కేబినెట్ భేటీ జరగనుంది. అనంతరం శాసనసభ సమావేశాలు మొదలుకానున్నాయి. అయితే గతంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలు రసాభసాగా జరిగాయి. తాజాగా జరగనున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు-2023ని సజావుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఏపీకి ఎన్నికల ఏడాది కనుక ఇప్పటికే సంక్షేమం, అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దూసుకెళ్లనుంది.
ఈనెల 11న రాత్రి ఏపీకి చేరుకోనున్న సీఎం జగన్
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని సర్కారు పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే తీసుకుంది. ఏపీలోనూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కొత్తగా పథకాలు, స్కీములను ప్రకటించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. ఇందుకు సంబంధించి ముందుగానే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు లండన్ పర్యటన ముగించుకుని ఈనెల 11న రాత్రి సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకోనున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలతో కీలకమైన సమావేశాలు నిర్వహించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంపై మరింత ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తొలుత వారం పాటు అసెంబ్లీ నిర్వహిస్తామని ప్రాథమికంగా నిర్ణయించినా, త్వరలోనే అధికారిక షెడ్యూల్ ఖరారు చేయనుంది.